న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ రూ.17,600 కోట్లు సేకరించాలని చూస్తున్నాయి. బిజినెస్‌లను విస్తరించడానికి, అప్పులను తీర్చడానికి ఈ ఫండ్స్ వాడనున్నాయి. ప్రిఫరెన్షియల్ షేర్లను అమ్మడం ద్వారా రూ.4,500 కోట్లు సేకరిస్తామని ఈ రెండు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. అలానే మరో రూ.7,100 కోట్లను ఈక్విటీ లింక్డ్ బాండ్లను అమ్మడం ద్వారా వార్డే పార్టనర్స్ నుంచి సేకరించనున్నాయి. పదేళ్ల కాలపరిమితితో 5 శాతం వడ్డీకి బాండ్లను అమ్మనున్నాయి.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా మరో రూ.6 వేల కోట్లను సేకరించాయి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చెరో రూ.3 వేల కోట్లను రైజ్ చేశాయి. షేర్లను అమ్మడం లేదా ఈక్విటీ లింక్డ్ బాండ్లను అమ్మడం ద్వారా మరో రూ. 17 వేల కోట్లు సేకరించే ప్లాన్‌లో ఉన్నాయి. దీనికి ఈ నెల చివరిలో షేర్‌హోల్డర్ల అనుమతి వస్తుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. మొత్తం రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో బిజినెస్‌ను మరింతగా విస్తరించాలని చూస్తున్నాయి.