నా దగ్గర మిగిలింది ఒకే కారు
కోర్టు ఖర్చుల కోసం బంగారం అమ్మాను
సాదాసీదా జీవితం గడుపుతున్నాను
నా భార్యకు, కొడుక్కీ బాకీ ఉన్నాను
కోర్టుకు తెలియజేసిన అనిల్ అంబానీ
అనిల్ అంబానీ.. ఒకప్పుడు ఇండియా కుబేరుల్లో ఆయనది ఆరోస్థానం. ఇప్పుడు అనిల్ పరిస్థితి దయనీయంగా మారింది. తన దగ్గర ఏమీ లేదని, పైగా కుటుంబ సభ్యులకే బాకీ పడ్డానని ఆయన కోర్టుకు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒక్క కారు, ఒక కళాఖండం మినహా ఆస్తులేమీ లేవని మొరపెట్టుకున్నారు. చైనా బ్యాంకులకు అప్పులు చెల్లించలేనని స్పష్టం చేశారు.
లండన్: ఇప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క కారు మిగిలిందని, అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని దివాలా తీసిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ లండన్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఖర్చుల కోసం తన వద్దనున్న నగలన్నీ అమ్ముకుంటే, రూ.11 కోట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులన్నీ కరిగిపోయాయన్నారు. ఒకప్పుడు దేశంలోనే ఆరో అతిపెద్ద ధనికుడిగా నిలిచిన అనిల్ అంబానీ.. ప్రస్తుతం జీరో దశకు వచ్చారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు వచ్చిన విమర్శలను అనిల్ కొట్టిపారేశారు. ‘నాకు రోల్స్ రాయిస్ కారు లేదు. ప్రస్తుతం ఒకే ఒక్క కారు ఉంది. హెలికాప్టర్ కూడా వాడటం లేదు’ అని అనిల్ చెప్పారు. ముంబై నుంచి మొట్టమొదటిసారి వీడియోలింక్ ద్వారా లండన్ కోర్టు విచారణకు అనిల్ హాజరయ్యారు. 700 మిలియన్ డాలర్ల బకాయిలు ఇప్పించాలంటూ చైనాకు చెందిన మూడు బ్యాంక్‌లు కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్‌లు కేసు వేశాయి. డెట్ రీఫైనాన్సింగ్ విషయంలో అనిల్ అంబానీ తన పర్సనల్ గ్యారెంటీని ఉల్లంఘించారని ఆరోపించాయి.
నా ఆస్తుల విలువ చాలా తక్కువ..
‘నా దగ్గర ఇప్పుడు పెద్దగా ఆస్తులేవీ లేవు. ఉన్నవన్నీ అమ్ముకున్నాను. ఇతర ఖర్చుల కోసం కోర్టు ఆమోదం మేరకు మిగిలిన ఆస్తులను అమ్మాల్సి ఉంది. నా తల్లికి రూ.500 కోట్లు, కొడుకు అన్మోల్‌కు రూ.310 కోట్లు బాకీ పడ్డాను. రిలయన్స్ ఇన్నోవెంచర్స్ కోసం రూ.500 కోట్ల లోన్ తీసుకున్నాను. ఆ కంపెనీలోని 1.2 కోట్ల షేర్లు ఇప్పుడు దేనికీ పనికిరావు. ఏ ట్రస్టుతోనూ నాకు మేలు జరగలేదు. నా దగ్గర ప్రస్తుతం ఒక కారు, 1.11 లక్షల డాలర్ల విలువైన కళాఖండం మాత్రమే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రొఫైషనల్ ఫీజును కూడా తీసుకోలేదు. ఇక ముందు తీసుకోను కూడా’ అని అనిల్ లండన్ కోర్టుకు తన గోడును వెల్లబుచ్చుకున్నారు. క్రెడిట్‌కార్డు బిల్స్ గురించి ప్రశ్నించగా, తన తల్లి కోసం షాపింగ్ చేశానని, తాను ఏమీ కొనుక్కోలేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆస్తుల వివరాలను అనిల్ కోర్టుకు సమర్పించారు. ఈ ఆస్తులన్నింటినీ కలిపినా లక్ష డాలర్లకు మించవన్నారు. చైనీస్ బ్యాంక్‌లకు రూ.5,821 కోట్లు చెల్లించాలని, కోర్టు ఫీజుల కింద రూ. ఏడు కోట్లు కట్టాలని కోర్టు ఈ ఏడాది మేలో అనిల్‌ను ఆదేశించింది. ఈయన బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో అంబానీ ఆస్తులను బహిర్గతం చేయాలని చైనీస్ బ్యాంక్‌లు పట్టుబట్టాయి.
అవన్నీ నా భార్యవే!
విచారణ సందర్భంగా బ్యాంకుల తరఫు లాయర్ మాట్లాడుతూ.. అనిల్ భార్య టీనా అనిల్ అంబానీ దగ్గరున్న నగలు, విలువైన వస్తువులు, రూ.60 లక్షల కరెంటు బిల్లు గురించి ప్రశ్నించారు. ఇందుకు ఆయన జవాబిస్తూ , అవన్నీ ఆమె సొంతమని, తనకు సంబంధం లేదని చెప్పారు. ఎలక్ట్రిసిటీ టారిఫ్‌ను భారీగా పెంచడం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందని వివరణ ఇచ్చారు. ఎకానమీ క్రైసిస్ వల్ల కారణంగా రిలయన్స్ ఇన్‌ఫ్రా ద్వారా 2019, 2020లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని కోర్టుకు తెలిపారు. అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని బ్యాంకుల తరఫున హాజరైన లాయర్ బంకిమ్ థంకీ ఆరోపించారు. తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటామని స్పష్టం చేశారు.