Anil Ambani: గుడ్‌న్యూస్ చెప్పిన అనిల్ అంబానీ.. బకాయిల చెల్లింపు, స్టాక్ దూకుడు..

Anil Ambani: గుడ్‌న్యూస్ చెప్పిన అనిల్ అంబానీ.. బకాయిల చెల్లింపు, స్టాక్ దూకుడు..

Reliance Infra Stock: అనిల్ అంబానీ గడచిన కొన్ని త్రైమాసికాలుగా తన కంపెనీల వ్యాపారాలను తిరిగి గాడిన పెడుతున్నారు. దాదాపు దశాబ్ధం కిందట భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసిన వ్యాపారవేత్త ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. వ్యాపార ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని వేగంతో ఆయన తన కంపెనీలను రుణ విముక్తులుగా చేస్తూ తిరిగి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపుతున్నారు. 

అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏప్రిల్ 2న స్టాక్ ఎక్స్ఛేంజీలకు కీలక సమాచారాన్ని అందించింది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CARE రేటింగ్స్ రిలయన్స్ ఇన్ ఫ్రా నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, దీర్ఘకాలిక స్వల్పకాలిక బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించి రేటింగ్‌ను ఉపసంహరించుకుందని తెలియజేసింది. పైన పేర్కొన్న బ్యాంక్ గ్యారెంటీలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు అనిల్ అంబానీ సంస్థ పూర్తిగా తిరిగి చెల్లించడం వల్ల రేటింగ్ వెనక్కి తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో నేడు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలో ఎగబాకాయి.

వాస్తవానికి అనిల్ అంబానీ సంస్థ దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్లు, రోట్లు, మెట్రో రైళ్ల ప్రాజెక్టులతో పాటు డిఫెన్స్ రంగంలో కూడా ఇంజనీరింగ్ ప్రాజెక్టులను నిర్వహించిన అనుభవం కలిగి ఉంది. అనిల్ అంబానీ చర్యలతో స్టాక్ తిరిగి తన పురోగమనాన్ని చూస్తోంది. గడచిన 11 ట్రేడింగ్ సెషన్లలో మెుత్తంగా 9 సెషన్లలో రిలయన్స్ ఇన్ ఫ్రా స్టాక్ తన ప్రయాణాన్ని లాభాల్లో ముగించింది. అలాగే గత నెల రోజుల్లో స్టాక్ ధర 21 శాతం పెరుగుదలను నమోదు చేసి ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాన్ని నింపింది. 

Also Read:-ఇన్వెస్టర్స్ ఎగబడి కొంటున్న స్టాక్.. ఆ డీలే కారణం..

నేడు మార్కెట్లు ముగిసే సమయంలో రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ షేర్ల ధర ఒక్కోటి స్వల్ప లాభంతో రూ.256.90 వద్ద ట్రేడింగ్ ముగించింది. అంబానీ పతనం తర్వాత రికవరీ మోడ్ లోకి వచ్చిన స్టాక్ దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తోంది. గడచిన 5 ఏళ్ల కాలంలో 2336 శాతం మెగా రాబడిని అందించి మల్టీబ్యాగర్ గుర్తింపును తెచ్చుకుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.