
Reliance Power Stock: అనిల్ అంబానీ దశాబ్ధకాలంగా పతనంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పేరు. ప్రస్తుతం ఆయన తన కంపెనీలను తిరిగి రుణ విముక్తిగా మార్చుతూ కొత్త వ్యాపార ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అన్న ముఖేష్ స్థాయిలో సంపద కలిగిన అతడు ప్రస్తుతం పాతాళం నుంచి తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకాన్ని నింపుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు మంచి ర్యాలీని చూస్తున్నాయి. ఉదయం 11.36 గంటల సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి 5.27 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో రూ.42.16 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు పతనం నుంచి తిరిగి పుంజుకుంటూ పెట్టుబడిదారులకు ఏకంగా 2వేల 275 శాతం భారీ రాబడిని అందించింది.
గత ఏడాది అనిల్ అంబానీ కంపెనీకి ఉన్న అన్ని రుణాలను క్లియర్ చేయటంతో రుణ విముక్తి పొందిన సంస్థగా మారింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఐదేళ్ల కిందట కంపెనీ షేర్లలో కనీసం లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ ఏకంగా రూ.23.79 లక్షలుగా మారి ఉండేది. అవున ఎందుకంటే ఏప్రిల్ 2020లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.1.79 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ప్రస్తుతం లక్షాధికారులుగా మారి ఉండేవారు.
గడచిన రెండేళ్ల కాలాన్ని పరిశీలించినా సరే స్టాక్ మంచి రాబడుల ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఈ కాలంలో స్టాక్ ధర ఏకంగా 235 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఏప్రిల్ 13, 2023న కంపెనీ షేర్ల ధర ఒక్కోటి కేవలం రూ.12.79 వద్ద ఉంది. అప్పటి నుంచి మంచి పెట్టుబడి డబ్బును రెండింతలు చేసి ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. గడచిన నెల రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటికీ రిలయన్స్ పవర్ షేర్లు మాత్రం 29 శాతం లాభాలను తన పెట్టుబడిదారులకు అందించి బుల్ ర్యాలీని కొనసాగించింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.