బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలి : ఈరవర్తి అనిల్ కుమార్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలి : ఈరవర్తి అనిల్ కుమార్
  • ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ ఎందుకు ప్రశ్నించడం లేదు?

ఆసిఫాబాద్, వెలుగు: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని, మాదిగలకు నిజంగానే  న్యాయం చేయాలనుకుంటే మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ కుమార్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ అడగాలని, లేకపోతే ఆయన మాదిగలకు ద్రోహం చేసినట్టేనన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్ తో కలిసి అనిల్​కుమార్ హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. దేశంలో బీజేపీ  పార్టీ మతతత్వ రాజకీయాలను కొనసాగిస్తోందని, అంటరాని తనాన్ని ప్రవేశపెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవస్థల కోసం పనిచేస్తున్న బీజేపీ.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్​అంబేద్కర్ ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తే బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్​ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపించిందని.. బేషరతుగా తొమ్మిదవ షెడ్యూల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 

జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ పాదయాత్రను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నేత భాస్కర్, నియోజకవర్గ ఇన్ చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ మాజీ చైర్మన్ గణపతి, యువజన జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మల్లేశ్, మునీర్, మాజీ ఎంపీపీ బాలేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్ తదితరులు పాల్గొన్నారు.