IND vs NZ 2nd Test: ప్రాక్టీస్ సరిపోవట్లే.. కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: భారత స్పిన్ దిగ్గజం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. అలవోకగా పరుగులు చేసే విరాట్.. ఒకో పరుగు కోసం చెమటోడ్చాల్సి వస్తుంది. అతని నుంచి భారీ ఇన్నింగ్స్ లు కూసి చాలా కాలమే అయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగే చేసి పెవిలియన్ కు చేరాడు. సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతిని ఆడడంలో విఫలమయ్యాడు. స్వీప్ చేసే క్రమంలో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో పూణే గ్రౌండ్ ఒకసారిగా మూగబోయింది.

అంతకముందు బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ కింగ్ డకౌటయ్యాడు. ఇలా కోహ్లీ ఔటైన ప్రతిసారి జట్టు కష్టాల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే.. కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. "కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాలి. ప్రాక్టీస్ సెషన్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అతను బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కంటే ముందుగానే దేశవాలీ క్రికెట్ ఆడి ఉండాల్సింది. కోహ్లీ పేలవ ఫామ్ కు కేవలం స్పిన్ మాత్రమే అని నేను అనుకోను. అతను క్రీజులోకి వచ్చినప్పుడు పిచ్‌లు తరచుగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి". అని అనిల్ కుంబ్లే తన మనసులో మాట చెప్పాడు. 

ALSO READ | Virat Kohli: చూశారుగా మన కోహ్లీ ఆట.. అతని కెరీర్‌లోనే చెత్త షాట్ ఇది: మాజీ క్రికెటర్

2021 నుండి కోహ్లీ ఆసియాలో రికార్డ్ పరిశీలిస్తే మొత్తం 26 ఇన్నింగ్స్ ల్లో 28.85 యావరేజ్ తో 606 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఆడడానికి తరచూ ఇబ్బంది పడుతున్నాడు. 26 ఇన్నింగ్స్ ల్లో కోహ్లీ 21 సార్లు స్పిన్నర్లకు వికెట్ సమ్పర్పించుకున్నాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ పరుగులు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికైనా ఫామ్ లోకి రాకపోతే టీమిండియా మ్యాచ్ లు గెలవడం  కష్టమే.