
టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత విజయాల్లో ఎంత కీలక పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పటిలా వీరు నిలకడగా ఆడలేకపోతున్నారు. బాగా రాణిస్తున్నా అంచనాలకు తగ్గట్టుగా వీరు రాణించలేకపోతున్నారు. కీలక దశలో వీరు జట్టు కోసం ఆడే విధానం అద్భుతం అనే చెప్పాలి. భారత విజయాల్లో ఎక్కువగా కోహ్లీ, రోహిత్ పేర్లే వినిపిస్తాయి. అయితే వీరిద్దరి కంటే నిలకడగా రాణించే ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అని భారత మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే చెప్పాడు. అయ్యర్ భారత వన్డే జట్టులో నమ్మదగిన ఆటగాడని కుంబ్లే వివరించాడు.
వన్డే ఫార్మాట్‌లో భారతదేశం తరపున అత్యంత నమ్మకమైన బ్యాటర్ గా శ్రేయాస్ అయ్యర్‌ను కుంబ్లే ఎంచుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు తరపున అతను ఆడే విధానాన్ని ప్రశంసించాడు. " టీమిండియాలో అయ్యర్ అత్యంత విశ్వసనీయ బ్యాటర్. వన్డే ప్రపంచ కప్‌లో అయ్యర్ ఎలా ఆడాడో మనం చూశాం. 4వ స్థానంలో ఇన్నింగ్స్‌ను నియంత్రించడమే కాకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాడు. అయ్యర్ లాంటి బ్యాటర్ భారత్ కు ఈతో అవసరం. శ్రేయాస్ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడాలో బాగా నేర్చుకున్నాడు". అని కుంబ్లే అన్నాడు.
ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ మొత్తం 5 మ్యాచ్ ల్లో 60 యావరేజ్ తో 243 పరుగులు చేశాడు. వీటిలో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్లో 48 పరుగులు చేసిన అయ్యర్ మరో 21 పరుగులు చేసి ఉంటే గోల్డెన్ బ్యాట్ గెలుచుకునేవాడు. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో 530 పరుగులు చేశాడు. వీటిలో 2 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.