అంబటి రాయుడు విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాయుడుకు కోహ్లీ, రవిశాస్త్రి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డాడు. 2019 వరల్డ్ కప్ లో రాయుడు ఆడాల్సి ఉండెనని..అయితే కోహ్లీ, రవిశాస్త్రి కారణంగానే సెలక్టర్లు అంబటిరాయుడును వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కుంబ్లే కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తగిన గుర్తింపు రాలేదు..
అంబటిరాయుడు టాలెంటెడ్ ప్లేయర్ అని..కెరీర్ తొలినాళ్లలోనే అతను సచిన్ అంతటి వాడు అవుతాడని అనుకున్నట్లు కుంబ్లే తెలిపాడు. కానీ అతని టాలెంట్ కు టీమిండియాలో వచ్చిన అవకాశాలకు అస్సలు పోలిక లేదన్నాు. కొన్ని తప్పిదాలతో రాయుడుకు సరైన గుర్తింపు రాలేదని చెప్పాడు.
2019 వరల్డ్ కప్ లో ఆడతాడని అనుకున్నా..
అంబటి రాయుడు విషయంలో కోహ్లీ, రవిశాస్త్రి పెద్ద తప్పు చేశారని కుంబ్లే అన్నాడు. రాయుడు 2019 ప్రపంచకప్ లో ఆడాల్సిందన్నాడు. వరల్డ్ కప్ కోసమే అతని నెం.4లో బ్యాటింగ్ చేసేందుకు సిద్దం చేశారని గుర్తు చేశాడు. కానీ వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ లో అతని పేరు లేకపోయే సరికి ఆశ్చర్యపోయానన్నాడు.
టీమిండియా ఘోర ఓటమి..
ఐపీఎల్ 2018లో రాయుడు అద్బుతంగా రాణించాడు. ఆ సీజన్ లో 602 పరుగులు చేయడంతో..భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మార్చి మధ్య కాలంలో రాయుడు టీమిండియాలో నాలుగో స్థానంలో 21 వన్డేలు ఆడాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 639 పరుగులు సాధించాడు. దీంతో రాయుడు 2019 జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ వరల్డ్ కప్ టీమ్ సమయంలో బీసీసీఐ సెలక్టర్లు రాయుడును కాదని ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేశారు. 2019 వరల్డ్ కప్ లో విజయ్ శంకర్ ఘోరంగా విఫలమవడం..నాల్గో నెంబర్ లో సరైన బ్యాటర్ లేకపోవడంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది.
రిటైర్మెంట్ ప్రకటన..
2019 వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడంపై అలిగిన రాయుడు..రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నాడు. ఇక తన స్థానంలో విజయ్ శంకర్ ను 3డీ ప్లేయర్ అంటూ ఎంపిక చేసిన అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై రాయుడు సెటైర్ వేశాడు. వరల్డ్ కప్ చూడటానికి 3డీ గ్లాసెస్ కొన్నాను అని రాయుడు ట్వీట్ చేశాడు. అయితే ఆ తర్వాత రాయుడు మళ్లీ ఇండియాకు ఎంపికవలేదు. భారత జట్టు తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1694 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్థసెంచరీలున్నాయి. 7 టీ20ల్లో 61 పరుగులు చేశాడు. 203 ఐపీఎల్ మ్యాచుల్లో 4348 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్థసెంచరీలున్నాయి.