ఫలిస్తున్న ఆపరేషన్​ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద

ఫలిస్తున్న ఆపరేషన్​ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
  • పశువుల్లో ఆడదూడలే పుట్టేలా పశుగణాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు
  • సబ్సిడీ పై రైతులకు సెమన్
  • 70వేల డోసులు సరఫరా
  • ఇప్పటికే 15వేల డోసులు పంపిణీ

హైదరాబాద్, వెలుగు:పశువుల్లో ఆడదూడలే పుట్టేలా పశుగణాభివృద్ధి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొంత మార్పులు చేసి ఆడ పశువుల సంతతి పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడ దూడల సంతతిని పెంచేందుకు సెక్స్‌‌‌‌ సార్టెడ్‌‌‌‌ సెమన్‌‌‌‌ ప్రక్రియను అమలు చేస్తున్నది. 

ఎదకొచ్చే పశువుల కోసం 65 శాతం సబ్సిడీపై ఈ సెమన్ అందిస్తున్నది. ఈ పద్ధతిలో ఎక్కువ శాతం ఆడ దూడలే పుట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశుసంవర్థకశాఖ ఈ విధానం అమలు చేస్తున్నది. ఈ విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో 650 ఆడదూడలు పుట్టినట్లు పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మల్లేశ్వరీ వెల్లడించారు.

96 శాతం ఆడ దూడలు పుట్టే చాన్స్

అగ్రికల్చర్ ఫామ్ మెకనైజేషన్ పెరగడంతో దున్నపోతులు, కోడె దూడల అవసరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది.. ఈ నేపథ్యంలో ఎదకొచ్చే ఆడ పశువులు గర్భం దాల్చితే ఆడ దూడలు పుడితే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది. 

ఆడ దూడల సంఖ్య పెంచి పాల ఉత్పత్తి పెంచేందుకు సెమన్ నుంచి ఎక్స్, వై క్రోమోజోములను వేరు చేసే సెక్స్‌‌‌‌ సార్టెడ్‌‌‌‌ సెమన్‌‌‌‌ పద్ధతిని ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ విధానంలో కృత్రిమ గర్భధారణ చేస్తే 96 శాతం ఆడ దూడలే జన్మించే అవకాశం ఉంది. దాంతో పాల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉన్నది.

ఫెయిల్ అయితే పైసల్ వాపస్​..

జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద ప్రభుత్వం సాధారణంగా ఉచితంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపడుతుంది. దీనికి తోడుగా ఇటీవల జాతీయ పాల అభివృద్ధి బోర్డు (ఎన్‌‌‌‌డీడీపీ) ద్వారా ఎక్స్, వై క్రోమోజోములను వేరు చేసే పద్ధతిని అమలు చేస్తోంది. 

కృత్రిమ గర్భధారణకు అవసరమైన పశువుల వీర్యాన్ని సేకరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం అమలు చేస్తున్నది. ఒక్కో డోసును రూ.675కు ఇస్తుండగా రైతులు రూ.250 చెల్లిస్తే ప్రభుత్వం రూ.425 సబ్సిడీ అందిస్తుంది. పశువుకు ఇంజెక్షన్ చేసిన 21 రోజుల్లో గర్భం దాలుస్తుంది. 

గర్భం దాల్చకపోతే రెండో డోసు కోసం రైతు మరో రూ.250 చెల్లించి ఇంజెక్షన్ చేయించాలి. మొదటిసారి రైతు చెల్లించిన రూ.250 రైతుకు తిరిగి ఇస్తారు. రెండు సార్లు గర్భం దాల్చక పోతే రూ.500 తిరిగి చెల్లిస్తారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రైతు పేరు ఆధార్‌‌‌‌ నంబర్‌‌‌‌తో పాటు పశువుకు ఇచ్చిన ట్యాగ్‌‌‌‌ నంబర్‌‌‌‌తో పాటు ఇతర వివరాలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. 

ప్రతి మండలానికి ఏర్పాటు చేసిన డాక్టర్ల బృందం ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌ను రైతులు తీసుకొని తమ పశువులు ఎదకు రాగానే సమాచారం అందిస్తే వారు వచ్చి ఇంజెక్షన్​ చేస్తారు. తొలి, మలి ఈతలో అయితే పశువులు త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉన్నందున ఈ పద్ధతితో ఆ రకమైన పశువులకే అమలు చేసే విధంగా అదికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి మండలానికో టీమ్..

సెక్స్‌‌‌‌ సార్టెడ్‌‌‌‌ సెమన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద్వారా కృత్రిమ గర్భధారణ చేసేందుకు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70వేల సెక్స్‌‌‌‌ సార్టెడ్‌‌‌‌ సెమన్‌‌‌‌ ఇంజెక్షన్ డోస్​లను మండలాలకు పంపించింది. 

ప్రతి బృందంలో డాక్టర్‌‌‌‌తో పాటు గోపాల మిత్ర ఉంటారు. ఆడదూడలు కావాలనుకునే రైతులు రూ.250 చెల్లించి ఒక డోసు ఇంజెక్షన్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 15,915  సెక్స్‌‌‌‌ సార్టెడ్‌‌‌‌ సెమన్‌‌‌‌ ఇంజెక్షన్​ లను ఎదకొచ్చిన పశువులకు ఇచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికే 650 ఆడదూడలు పుట్టాయి. 

ఈ కొత్త పద్ధతిలో 96శాతం ఆడ దూడలే జన్మించే అవకాశం ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి . డాక్టర్​ మల్లేశ్వరీ, సీఈవో, పశుగణాభివృద్ధి సంస్థ