అడవిపై నిఘా.. సీసీ కెమెరాల ఏర్పాటుతో తగ్గిన జంతువులవేట

  • అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న వన్యప్రాణులు
  • మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బోర్ల సౌకర్యం, సోలార్ పంపులు
  • వన్యప్రాణుల సంఖ్య ఘననీయంగా పెరిగిందంటున్న ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: అడవికి ‘మూడోకన్ను’ భద్రత కల్పిస్తున్నది. వేసవిలో అడవుల్లోని వన్యప్రాణులకు తాగునీటి కొరత ఏర్పడగా, నీటి కోసం వచ్చే జంతువుల కోసం వేటగాళ్లు తాగునీటి వనరుల వద్ద ఉచ్చులు ఏర్పాటు చేసి వేటాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు చోటివ్వకుండా ఫారెస్ట్​ఆఫీసర్లు అటవీ ప్రాంతంలో అనుమానం ఉన్నచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో వేటగాళ్ల కదలికలు, కలప అక్రమ రవాణా కంట్రోల్​ అవుతున్నాయి. వన్యప్రాణులను వేటాడుతున్నట్లు సమాచారం తెలియగానే, ఫారెస్ట్​ఆఫీసర్లు వేటగాళ్లను గుర్తిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. వాకీటాకీల సమాచారం, నిఘా నేత్రాల ఏర్పాటుతో వన్యప్రాణుల వేట, అక్రమ కలప రవాణా తగ్గింది. అడువుల్లో జంతువులు స్వేచ్ఛగా సంచరించడంతోపాటు, వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.

సోలార్​ పంపు సెట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు..

వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో సోలార్ పంప్ సెట్ల ద్వారా నీటిని సంపుల్లో నింపుతున్నారు. దీంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి . ఆయా ప్రదేశాల్లో వాటి రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో తాగునీటి కోసం వన్యప్రాణులు ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. సోలార్ పంప్ సెట్ విధానం మూలంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు రేంజ్ పరిధిలో 12 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 5 సోలార్ పంపులు, 10 నీటి కుంటలు, మహబూబాబాద్ రేంజ్ పరిధిలో 8 చోట్ల సీసీ కెమెరాలు, సోలార్ పంపులు ఏర్పాటు చేశారు.

స్వేచ్చగా సంచరిస్తున్న అటవీ జంతువులు..

మహబూబాబాద్​జిల్లా పరిధిలో గంగారం, కొత్తగూడ, బయ్యారం మండలాల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. గతంలో వేసవిలో ఎక్కువ శాతం వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలయ్యేవి. ప్రస్తుతం సీసీ కెమెరాల నిఘా, కృత్రిమ జలవనరుల ద్వారా తాగునీటి వసతి కల్పించడంతో జంతువుల వేట తగ్గింది. జిల్లాలో ఐదేండ్లలో వన్యప్రాణుల వేటకు సంబంధించి 200 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఏడాది ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అడవిలో జింకలు, అటవీ దున్నలు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, నెమళ్లు, రాబంధులు ఎక్కువగా సంచరిస్తున్నాయి.

అటవీ సంపదను పరిరక్షించుకోవాలి

అటవీ సంపదను, వన్యప్రాణులను సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గతంలో కంటే ఎక్కువగా నిఘా పెంచడంతో జిల్లాలో వేట శాతం తగ్గింది. అటవీ ప్రాంతంలో వలలు, ఉచ్చులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు.

విశాల్, డీఎఫ్​వో, మహబూబాబాద్