కాంగ్రెస్ ​ప్రజాహిత యాత్రపై బీఆర్​ఎస్​ లీడర్ల అటాక్

కాంగ్రెస్ ​ప్రజాహిత యాత్రపై బీఆర్​ఎస్​ లీడర్ల అటాక్
  • కర్రలు, క్రికెట్​స్టంప్స్​తో దాడికి దిగిన బీఆర్ఎస్​ లీడర్లు
  • ఐదుగురు కాంగ్రెస్​ లీడర్లకు గాయాలు
  • భయపడేది లేదన్న టీపీసీసీ నేత అనిరుధ్​రెడ్డి 

జడ్చర్ల/జడ్చర్ల టౌన్​, వెలుగు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి చేపట్టిన ‘ప్రజాహిత పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాత్ర చేస్తున్న కాంగ్రెస్​ లీడర్లపై కొందరు బీఆర్ఎస్​ లీడర్లు కర్రలు, క్రికెట్​స్టంప్స్​తో దాడికి చేయడంతో ఆరుగురు గాయపడ్డారు. మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుధ్​రెడ్డి ప్రజాహిత పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర ఆదివారం జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ కు చేరుకుంది. అక్కడ జరిగిన కార్నర్​ మీటింగ్​లో అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ 2008లో దళితుల శ్మశానవాటిక కోసం అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం 19 గుంటల భూమిని కేటాయించిందన్నారు. కానీ, ఆ భూమిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ లీడర్​ ఆక్రమించుకుని ప్లాట్లు చేసి అమ్మేసింది చాలక..జడ్చర్ల హౌసింగ్​బోర్డులో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

విషయం తెలుసుకున్న రూలింగ్​పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్ ప్రణీల్​చందర్, తన అనుచరులతో కార్నర్​మీటింగ్​జరిగే చోటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​కార్యకర్తలకు, ప్రణీల్​చందర్, ఆయన అనుచరులకు వాగ్వాదం, తోపులాట జరిగింది.​ కొద్దిసేపటికి కాంగ్రెస్ కార్యకర్తలపై కొంతమంది కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో జడ్చర్ల మహిళా కాంగ్రెస్​ప్రెసిడెంట్​భర్త ఆశన్న, నాయకులు రమేశ్​నాయక్​, రవి నాయక్​, పెంట్యా నాయక్​, బాలు ముదిరాజ్​గాయపడ్డారు. వీరిని జడ్చర్ల జనరల్​హాస్పిటల్​కు తరలించారు. అంతకుముందు గ్రామంలో పాదయాత్ర ప్రవేశిస్తోందని డప్పు చాటింపు వేయించగా అడ్డుకున్నట్టు తెలిసింది. 

గొడవ తర్వాత అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే దాడులుకు దిగుతున్నారని విమర్శించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు  భయపడేది లేదన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్​ పార్టీ లీడర్ల అక్రమాలు, భూ దందాలు, కబ్జాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని హెచ్చరించారు. రూలింగ్​పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో జడ్చర్ల గడ్డపై ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్​జెండా ఎగుర వేస్తామన్నారు.