టీటీడీ నిర్ణయం సరైంది కాదు

టీటీడీ నిర్ణయం సరైంది కాదు
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల తిరస్కరణపై అసంతృప్తి 
  •  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల టౌన్​, వెలుగు:  తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.  ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు.  గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల తరహాలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా భక్తులకు దర్శన, వసతి సదుపాయాలను టీటీడీ కేటాయించేది. 

ఈ మధ్యకాలంలో టీటీడీలో తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లు బాటు కావడం లేదు.  ఒకవేళ సీఎంకు తెలియకుండా టీటీడీ అధికారులే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల ఆలయానికి ఆంధ్ర భక్తుల కంటే తెలంగాణా భక్తులే అధికంగా వెళ్తారని, టీటీడీకి భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో ఎక్కువ భాగం తెలంగాణా భక్తుల నుంచే వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీటీడీ, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ప్రజాప్రతినిధులను కూడా గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు.