ఇంటర్నెట్లో కంటెంట్ క్రియేటర్స్‌కు కొదవేలేదు. కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నా కూడా కొందరు మాత్రం అందరిలో ప్రత్యేకంగా ఉంటారు. ఆ కోవకు చెందుతుంది అనీషా దీక్షిత్.యూట్యూబ్ ఛానెల్‌ను ఎటువంటి ప్లాన్ లేకుండా మొదలుపెట్టింది. మన చుట్టూ రోజూ చూసే సంఘటనలను కామెడీ స్కిట్స్‌గా చేసి నవ్విస్తుంది. ఆడవాళ్లకు సంబంధించిన ఎన్నో విషయాలను అందరికీ అర్ధమయ్యేలా చెప్తుంది. మహిళల ఎంపవర్మెంట్ గురించి అవగాహన కలిగిస్తోంది. ఇలా సోషల్ ఇష్యూస్ గురించే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగింది.
‘‘మొదటి నుంచీ కూడా మహిళలు, ఆడపిల్లలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడాలి అనుకున్నా. అందుకే ఆ సబ్జెక్ట్‌ల మీద అవేర్నెస్ కలిగించే వీడియోలు చేస్తున్నా. అదే టైంలో వీలైనంతవరకు వాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం కూడా చేస్తున్నా. సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతుందో సునిశితంగా గమనిస్తే... మగవాళ్లకి, ఆడవాళ్లకి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
మనం చాలా సాధించాం. టెక్నాలజీ పరంగా ఎంతో ఎదిగాం అని అనుకుంటున్నాం. కానీ ఈ21వ శతాబ్దంలో కూడా ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి గురించి ఇప్పటికీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అందుకే నా వీడియోల్లో ఆడవాళ్లకు సంబంధించిన విషయాలను మాట్లాడుతుంటా. వాళ్లని ఎంపవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నా ఛానెల్ సబ్ స్క్రయిబర్స్లో 60 శాతానికి పైగా ఆడవాళ్లే ఉన్నారు.
రిక్షావాలీ వెనక
నా అసలు పేరు అనీషా దీక్షిత్ కంటే కూడా నన్ను ‘రిక్షావాలీ’ అనే పేరుతో ఎక్కువమంది గుర్తుపట్టేవాళ్లు. ‘రిక్షావాలీ’ ఇదేం పేరు అనిపిస్తుంది కదా! దాని వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 2013లో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టక ముందు రిక్షాలో వీడియో షూటింగ్ చేసేదాన్ని. అప్పుడే సరదాగా కొన్ని సెల్ఫీలు తీసుకున్నా. అప్పుడే నాకు ‘రిక్షావాలా’ ఉన్నారు కానీ ‘రిక్షావాలీ’ లేరు కదా అనే ఆలోచన వచ్చింది. అందుకే అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టా.
ఆ తరువాత కొన్నాళ్లకు నా అసలు పేరుతోనే ప్రజలకి దగ్గర అవుదాం అనుకున్నా. అందుకే రిక్షావాలీని కాస్తా అనీషా దీక్షిత్‌గా మార్చుకున్నా. 2018లో జరిగిన ‘యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్’లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చా. టెడ్ఎక్స్ టాక్ చేశా. కామెడీతో ఆడియెన్స్‌ను అలరిస్తూ... మహిళల ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ కలిగించడం మీద దృష్టి పెట్టా. అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకుని ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా అవసరం.
యాక్టింగ్ అంటే చాలా ఇష్టం
యూట్యూబ్ ఛానెల్ పెట్టడం వెనక ఒక కారణం ఉంది. చిన్నప్పటి నుంచీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీ సెలబ్రేషన్స్‌లో మిస్‌కాకుండా పార్టిసిపేట్ చేసేదాన్ని. బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ప్రతిరోజూ ఆడిషన్స్‌కి వెళ్లా. అప్పుడు చాలా రిజెక్షన్స్ ఎదురయ్యాయి. అప్పుడు నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు హజ్బెండ్ కేలబ్ యూట్యూబ్ ఛానెల్ పెట్టమని సజెస్ట్ చేశాడు. ఆ సలహా నచ్చి వీడియోలు చేయడం ఎలా అని ఎక్స్ప్లోర్ చేశా. ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో యూట్యూబర్స్‌ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
యూట్యూబ్ ఎలా పనిచేస్తుందని ఒక పక్క తెలుసుకుంటూనే మరో పక్క ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. 2013లో రిక్షావాలీ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన మొదటి వీడియో “వార్నింగ్”. ఆ వీడియోలో సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘రామ్ లీలా’ సినిమా రివ్యూ చేశా. అలా నా యూట్యూబ్ జర్నీ మొదలైంది. ఇండియాలో జనాల డైలీ లైఫ్‌లో ఉండే పరిస్థితులనే తీసుకుని షార్ట్ స్కిట్స్ చేయడం మొదలుపెట్టా. ఛానెల్ మొదలుపెట్టినప్పుడు ఇన్ని లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ వస్తారని అస్సలు ఊహించలేదు.
ఆ బలమే ముందుకు నడిపిస్తోంది
ఛానెల్ మొదట్లో స్క్రిప్ట్ రాయడం, షూటింగ్ చేయడం, ఎడిట్ చేసుకోవడం అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ఇప్పడు నాకో టీం ఉంది. అందరం మాట్లాడుకుని స్క్రిప్ట్ రాస్తున్నాం. మేం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఐడియాలు వస్తాయి. వాటినుంచి బెటర్ ఐడియాలు తీసుకుంటాం. సోషల్ మీడియా చాలామందికి కెరీర్ ఇచ్చింది. అయితే ఇందులో బయటకు కనిపించే పాజిటితో పాటు కనిపించకుండా ఉండే నెగెటివ్ అంశాలు కూడా ఉంటాయి.
కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్లకు యాక్సెస్ పెరగడమనేది కత్తిమీద సాము. ఇలాంటప్పుడే మనం ఏంటి అనేది తెలుసుకుని మనగలగడం ముఖ్యం. చాలాసార్లు ఊరుపేరు లేకుండా, ముఖం కూడా లేని వ్యక్తులు ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటివి అస్సలంటే అస్సలు పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఇప్పుడు ఇలా చెప్తున్నా కానీ... మొదట్లో ట్రోల్స్, బుల్లీయింగ్ వల్ల చాలా ఇబ్బందిపడ్డా. అవి నా వర్క్ మీద బాగా ఎఫెక్ట్ చూపాయి కూడా. కాలం గడుస్తున్న కొద్దీ అలాంటి ట్రోల్స్, తిట్ల మీద దృష్టి పెట్టడం టైంవేస్ట్ అనిపించింది. నాకు సపోర్టుగా లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వాళ్లే నన్ను ముందుకు నడుపుతున్నారు.
దాచుకునే సమస్యలు కావవి
సోషల్ మీడియాలో నిన్ను నువ్వుగా చూపించుకోవడం అనేది కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ అలా ఉంటేనే మన నిజాయితీ గురించి నలుగురికీ తెలుస్తుంది. ఆ మధ్య నాకు జరిగిన సర్జరీ గురించి ఒక వీడియో చేశా. సర్జరీ గురించి చెప్పేటప్పుడు మొదట్లో కాస్త తడబడ్డా. కానీ ఆ తరువాత నేను ఏ స్టాండ్ మీద ఉండాలనుకున్నానో అర్థమైంది. ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా పడే ఇబ్బందులు, సమస్యల గురించి చెప్పాలనుకున్నా. అలాగే వాటి నుంచి బయటపడేందుకు వాళ్లు చేస్తున్న పోరాటం గురించి చూపించాలి అనుకున్నా.
అలాంటప్పుడు నేను నిజాయితీగా ఉండాలి కదా! చాలామంది ఆడవాళ్లు మామూలు సమస్యగా చూసే అతి పెద్ద ఇబ్బంది నాక్కూడా ఎదురైంది. అదే యుటిరైన్ ఫైబ్రాయిడ్స్. దాని గురించి అవగాహన కలగాలని నా సర్జరీ గురించి వ్లాగ్ చేస్తే 20లక్షలకి పైగా చూశారు. సెన్సిటివ్ టాపిక్ అయిన ఆ సబ్జెక్ట్ గురించి నేను ఓపెన్‌గా మాట్లాడడాన్ని చాలామంది అమ్మాయిలు, ఆడవాళ్లు మెచ్చుకున్నారు. ఈ వీడియో చూసిన మగవాళ్లకు కూడా ఆడవాళ్లు పడే ఇబ్బంది గురించి తెలుస్తుంది కదా!
జీవితం చాలా నేర్పిస్తుంది
ఫిజికల్ హెల్త్ గురించే కాకుండా నా మానసిక ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకుంటా. సమస్య వస్తేనే దాని గురించి పట్టించుకోవడం కాకుండా ఎప్పుడూ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్న దాని మీద చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. ఏ విషయం గురించి అయినా మన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఆలోచనల్లో మార్పు వస్తుంది.
కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలంటే సరైన సోర్స్ కావాలి. దానివల్ల వచ్చే నాలెడ్జి ఆ వ్యక్తి ఆలోచనల్లో స్పష్టత తెస్తుంది. ఆ స్పష్టత వచ్చి, ఆలోచనలు అదుపులో ఉంటే ఎవరైనా మంచిగానే ఉంటారు. కొన్ని సందర్భాల్లో జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగని జీవితం అందమైనది కాకుండా పోదు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన ఆలోచనల్లో మార్పు వస్తే కష్టమైన ఆ సమయాన్ని దాటి అందమైన జీవితాన్ని చూడొచ్చు. అందుకే జీవితంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అదే నా పాలసీ.
డిజిటల్ మీడియాలో క్రియేటర్స్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. చేస్తున్న కంటెంట్ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఒకటికి రెండుసార్లు గమనించుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇవ్వాళరేపు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది చాలా ఎక్కువ. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏదంటే అది చేస్తుంటారు కొందరు. అలాకాకుండా సమాజం మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడేలా బాధ్యతగా ఉండాలి” అంటుంది అనీషా.
బాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేసేందుకు యూట్యూబర్లతో కలిసి వీడియోలు చేస్తుంటారు నటీనటులు. అలా రాజ్ కుమార్ రావ్, ప్రియాంక చోప్రా, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్, బోమన్ ఇరాని వంటి వాళ్లతో వీడియోలు చేశా. ప్రియాంక చోప్రాతో కలిసి వీడియో చేయడం అనేది నా ఎన్నాళ్ల కలో నిజమైన రోజు.
జర్మనీలోని బెర్లిన్‌లో జనవరి17, 1991న పుట్టింది అనీషా. హైస్కూల్ చదువు జర్మనీలో, కాలేజీ చదువు ‘ది లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’లో పూర్తి చేసింది. యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది. జన్మనిచ్చిన తండ్రి ఆశిష్ దీక్షిత్. మారు తండ్రి విల్లీ. తల్లి దియా దీక్షిత్. సోదరి దేవిక దీక్షిత్. భర్త పేరు కేలబ్. ‘అనీషా దీక్షిత్’ యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ‘అనీషా దీక్షిత్ షార్ట్స్, సింప్లీ అనీషా దీక్షిత్’ అనే ఛానెల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, మ్యూజికల్లీ అకౌంట్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 22న జరిగిన ‘ఇండియాస్ ఓటీటీ అండ్ వెబ్ ఎంటర్టైన్మెంట్’ కాంక్లేవ్‌లో పాల్గొంది.
రిక్షావాలీ ఛానెల్ కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించా. ఇండియా, యుఎస్ఎ, స్విట్జర్లాండ్, జర్మనీల్లో థియేటర్ ప్రొడక్షన్ చేశా. జర్మన్, ఇంగ్లిష్, హిందీ అలవోకగా మాట్లాడతా. ఫ్రెంచ్ భాష మేనేజ్ చేస్తా.
ఒబామాని కలిసిన వేళ!
నా జీవితంలో బరాక్ ఒబామాను కలవడం అనేది మర్చిపోలేని అద్భుతమైన క్షణం. ఆయన్ని కలవడానికి అందరం వరసగా నిల్చున్నాం. ఒక్కొక్కరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి, నవ్వి ఒక ఫొటో దిగుతున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చే టైంకి పరుగెత్తుకెళ్లి ఆయన్ను హగ్ చేసుకున్నా. ఆయన సెక్యూరిటీ నన్ను లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు వెంటనే ‘‘మిమ్మల్ని, మిషెల్లి ఒబామాను నేను చాలా చాలా ఇష్టపడతా. మీ ఇద్దరూ నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు’’ అని చెప్పా. అందుకు ఆయన ‘‘థ్యాంక్స్ చెప్పి. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నా” అనడంతో అప్పటివరకు గంభీరగా ఉన్న వాతావరణం కాస్తా నవ్వులతో తేలిక పడింది.