- వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి
- మూడు సెగ్మెంట్ల ద్వారా నీటి సరఫరా
యాదాద్రి,వెలుగు: తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం యాదాద్రి కలెక్టరేట్లో గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు.
వాటర్‌ట్యాంకులను ప్రతినెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయాలని, నీటి సరఫరా చేస్తున్న ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి అవసరాలకు స్పెషల్ డెవలప్మెంట్ఫండ్స్, డిపార్ట్మెంట్, పంచాయతీ ఫండ్స్ వినియోగించుకోవాలని తెలిపారు. అవసరమైన చోట ట్యాంకర్లను, ప్రైవేట్బోర్లను లీజుకు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు తాగునీరు అందించడం మొదటి ప్రాధాన్యతగా అధికారులందరూ సమష్టిగా పనిచేసి తాగునీటి సమస్యను అధిగమించాలని సూచించారు.
మూడు సెగ్మెంట్ల ద్వారా వాటర్‌సప్లయ్..
వేసవిలో జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, 726 హ్యబిటేషన్లు, 6 మున్సిపాలిటీల్లో మూడు సెగ్మెంట్ల ద్వారా ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. మొదటి సెగ్మెంట్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా కింద 525 ఆవాసాలు, ఆలేరు మున్సిపాలిటీలో 10, యాదగిరిగుట్టలో 4, పోచంపల్లిలో 4, మోత్కూరులో 2, భువనగిరిలో 5 మెర్జ్ హ్యబిటేషన్లు కవర్ అవుతున్నాయని వివరించారు.
జిల్లాలో 2363 విద్యుత్ మోటర్లు పనిచేస్తున్నాయని, వీటిలో 15 బోరు మోటర్లు రిపేర్‌లో ఉన్నాయని, వీటిని రెండు మూడు రోజుల్లో బాగుచేయించి వినియోగిస్తామన్నారు. 392 చేతి పంపులు ఉన్నాయని, వీటిలో 66 పంపులకు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. జిల్లాలో 2674 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్‌కు సంబంధించి 10 కిలో మీటర్ల పైప్ లైన్ లీకేజీ ఉంటే పునరుద్ధరించామని వివరించారు.
అంతకుముందు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి, మిషన్‌భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణయ్య, డీఆర్డీవో ఎంఏ కృష్ణన్, డీపీవో సునంద, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
అందరికీ ఉపాధి కల్పించాలి..
గ్రామాల్లో అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. కూలీల సంఖ్య పెరిగేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో కూలీలకు నీడ ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి వసతి కల్పించాలన్నారు. పని పూర్తయిన వాటికి మస్టర్స్ అప్లోడ్ త్వరగా చేయాలని, గ్రామాల అవసరాలను బట్టి పనులను గుర్తించి లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.