పకడ్బందీగా సర్వే నిర్వహించాలి

  • మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితారామచంద్రన్  

నల్గొండ, వెలుగు : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నల్గొండ జిల్లా ప్రత్యేకాధికారి అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు పథకాలకు సంబంధించి విధివిధానాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించి అర్హులను మాత్రమే ఆయా పథకాలకు ఎంపిక చేయాలన్నారు. 

ప్రజలు అందుబాటులో ఉన్నప్పుడే గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించే విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతు భరోసా సర్వేకు జిల్లాలో 140 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 138 రెవెన్యూ గ్రామాల్లో 70 శాతం సర్వే పూర్తి చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు అర్హత జాబితా డేటా నమోదు చేస్తున్నామని చెప్పారు. అనంతరం నగల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులు ఉన్నారు.