పరిచయం: టాలెంట్​కు లుక్స్​తో సంబంధం లేదు.. అంజలి ఆనంద్

పరిచయం: టాలెంట్​కు లుక్స్​తో సంబంధం లేదు.. అంజలి ఆనంద్

టాలెంట్​కు రూల్స్​ ఉండవు. లుక్స్​తో సంబంధం ఉండదు’ అంటోందిఈ బ్యూటీ. ఇండస్ట్రీలో తన పర్ఫార్మెన్స్​తోమంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. ‘ప్లస్​ సైజ్డ్​ యాక్టర్’ అనే ఒక ట్యాగ్​ ఎందుకు ఇస్తున్నారంటూ నెగెటివ్​ కామెంట్స్​పై తనదైన రిప్లయ్ ఇచ్చింది. దీంతో చాలామందికి ఇన్​స్పిరేషన్​గానూ నిలిచిందట! ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే.. రీసెంట్​గా వచ్చిన ‘డబ్బా కార్టెల్’ సిరీస్​లో షాహిదా పాత్రలో నటించిన అంజలి ఆనంద్ ఇంట్రెస్టింగ్​ జర్నీ ఇది. 

ముంబైలోని పంజాబీ ఫ్యామిలీలో పుట్టింది అంజలి. తనెవరో కాదు.. తండ్రి దివంగత యాక్టర్​ దినేశ్ ఆనంద్. తల్లి సరోజ్​ ఖాన్​ కొరియోగ్రాఫర్ల కూతురు. 2017లో ‘ఢాయి కిలో ప్రేమ్’​ అనే టీవీ సీరియల్​తో నటనలో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సీరియల్స్, టీవీ రియాలిటీ షోల్లోనూ కనిపించింది. 2021లో వచ్చిన ‘బెల్​ బాటమ్’ అనే సినిమాతో వెండితెరపై మెరిసింది అంజలి. ఈ ఏడాది వచ్చిన ‘డబ్బా కార్టెల్’ సిరీస్​లో షాహిదా పాత్రలో మెప్పించింది. ఇన్నేండ్ల తన సినిమా కెరీర్​ గురించి పలు సందర్భాల్లో ఆమె పంచుకున్న విశేషాలివి. 

మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నాన్న ఫ్రెండ్స్​ అయిన పెద్ద యాక్టర్స్ ఇంటికి వచ్చి వెళ్లడం నాకు గుర్తుంది.15 ఏండ్లకే అమ్మకి సాయంగా ఉండాలని పనిచేయడం మొదలుపెట్టా. స్కూల్ ఫంక్షన్లు, వెడ్డింగ్​ సంగీత్​లు, పార్టీల్లో కొరియోగ్రాఫర్​గా చేశా. వాళ్లకు అది పార్టీ. నాకు వర్క్​. 21 ఏళ్లున్నప్పుడు నా డ్రీమ్స్ గురించి మా అమ్మతో చెప్పేదాన్ని. నా మనీ సేవ్ చేసుకుని, బ్యారీ జాన్ యాక్టింగ్ ఇన్​స్టిట్యూట్​లో చేరతా అని. ఎందుకంటే నన్ను లాంచ్ చేయడానికి ఎవరూ లేరు. 

ఏదైనా నాకోసం నేనే చేసుకోవాలి అని నాకు తెలుసు. చెప్పినట్టే వెళ్లి చేరా.. నేర్చుకున్నా. కానీ, అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ కొరియోగ్రఫీ రీస్టార్ట్​ చేశా. అటు సినిమాలకు చాలాసార్లు ఆడిషన్లు ఇచ్చా. కానీ, నేను లావుగా ఉండడం వల్ల సెలక్ట్ అయ్యేదాన్ని కాదు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొన్నా. కానీ, ఎప్పుడూ వాటివల్ల ఎఫెక్ట్ కాలేదు. నా లక్ష్యం ఒక్కటే.. ‘అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి నా తలుపు తట్టాలి’ అని. అది నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 


నవ్వుతూ ఫేస్ చేయాలి

నాకు మొదటి నుంచీ అవకాశం ఇవ్వమని అడిగే అలవాటు లేదు. మనకు రావాలని ఉంటే అది తప్పకుండా వస్తుంది అనుకుంటా. ప్రాబ్లమ్స్ వస్తాయి.. పోతాయి. కానీ వాటిని నువ్వెలా ఎదుర్కొన్నావు? అనేదే ముఖ్యమైన విషయం. ఏదైనా సమస్య ఎదురైతే నవ్వుతూ దాన్ని ఫేస్ చేస్తే అది పెద్దగా అనిపించదు. కానీ, దాన్ని సీరియస్​గా తీసుకుంటే చిన్న మట్టి దిబ్బ కూడా మహా పర్వతంలాగ కనిపిస్తుంది.

నేనేం డిఫరెంట్​గా లేను

హృతిక్ రోషన్, గోవిందలను అందరూ ఇష్టపడతారు. నేను కూడా. కానీ ఇద్దరూ ఒకేలా ఉండరు. గోవింద, రిషి కపూర్ లాంటి వాళ్లు లావుగా ఉన్నా ఎవరూ వాళ్లని నెగెటివ్ కామెంట్ చేయరు. అదే మహిళలు బొద్దుగా ఉంటే మాత్రం ‘ప్లస్​ సైజ్డ్​​ యాక్టర్’ అని ట్యాగ్​లు ఇస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలో రెండు రకాలుగా ఉంటుంది. కొందరు మగవాళ్లలో వేర్వేరు బాడీ టైప్​లు ఉన్న వాళ్లను ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అదే ఒక మహిళ అయితే డిస్కషన్స్ మొదలవుతాయి. 

దానికి ఉదాహరణ ‘డర్టీ పిక్చర్’​లో నటించిన విద్యాబాలన్​. తన పర్ఫార్మెన్స్​ కంటే బాడీ టైప్​ గురించే ఎక్కువ డిస్కషన్స్​ జరిగాయి. నిజానికి ఎవరి బాడీ టైప్ వాళ్లకి ఉంటుంది. ఇప్పుడు నన్ను కూడా ఒక నటిగా నా క్రాఫ్ట్​ని చూడడం వల్లే అవకాశాలు వస్తున్నాయి తప్ప, బాడీ టైప్​ని చూసి కాదు. ఈ పరిస్థితులను మార్చాలి. 

ఈ విషయంలో కొందరు నన్ను ప్లస్​ సైజ్​ని రిప్రజెంట్​ చేస్తూ ఇంటర్నెట్​లో ప్రొమోట్ చేయొచ్చు కదా అని సలహాలు ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. చేసి ఉంటే దానివల్ల నాకు డబ్బులు వచ్చి ఉండేవి. కానీ, నేను డిఫరెంట్​గా ఉన్నానని అనుకోవట్లేదు. అందుకే అలాంటివి ప్రమోట్​ చేయలేదు. 

బరువు ఇంకా పెరగాలన్నారు!

కొరియోగ్రఫీ చేసే రోజుల్లో నేను ఆ పెండ్లికి సంబంధించి షాపింగ్​లకు వెళ్లేదాన్ని కాదు. కానీ, ఒకసారి వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు పెళ్లి వాళ్లంతా షాపింగ్ చేస్తుంటే, నాకు ఆకలేసి తినడానికి వెళ్లిపోయా. అయితే.. అక్కడ ఒక ప్రొడక్షన్​ టీం ఉంది. వాళ్లు నన్నే గమనిస్తున్నారు. కానీ.. నేను పట్టించుకోకుండా తింటూనే ఉన్నా. తినడం అయిపోయేవరకు వాళ్లు వెయిట్ చేసి, నా దగ్గరకి వచ్చారు. సందీప్ సికంద్​ అనే అతను ‘మీరు ఎవరు? ఏం చేస్తుంటారు?’ అని నన్ను అడిగాడు. 

నేను కొరియోగ్రఫీ చేస్తాను. యాక్టర్​ కావాలనేది డ్రీమ్​ అని చెప్పా. అతను ‘టీవీ సీరియల్​లో హీరోయిన్ పాత్ర ఉంది చేస్తావా?’ అని అడిగాడు. ఆ మాట వినగానే నేను షాక్​ అయ్యా. టెలివిజన్​లో చేయాలని కానీ, ఆఫర్లు వస్తాయని కానీ ఊహించలేదు. ఎందుకంటే అందులో ఉండేవాళ్లంతా స్లిమ్​గా ఉంటారు అనుకుని, అక్కడ ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ వాళ్లు అలా చెప్పడంతో అదే రోజు సాయంత్రం నేను ఆడిషన్ ఇచ్చా. అందులో పల్లెటూరి అమ్మాయి పాత్ర నాది. 

ముంబైలో ఉన్నప్పటికీ నాకు హిందీ పెద్దగా రాదు. అయినా నేను చేస్తా అని చెప్పా. వాళ్లు కూడా బరువు గురించి బాధపడకుండా, కాన్ఫిడెంట్​గా ఉండే అమ్మాయి కోసమే వెతుకుతున్నారు. అలా ‘ఢాయి కిలో ప్రేమ్’​ సీరియల్​లో హీరోయిన్​గా నటించా. అప్పటికే వందల కిలోలపైనే బరువున్నా. అయినా నేను చాలా యాక్టివ్​ లైఫ్ లీడ్ చేసేదాన్ని. ఈ అవకాశం వచ్చే టైంకి ట్రెక్కింగ్, సైక్లింగ్​ వంటివి చేస్తూ నా బరువును తగ్గించుకునే పనిలో ఉన్నా. అలాంటి సమయంలో ఇంకా వెయిట్ పెరగాలి అనేసరికి ‘అస్సలు కుదరదు’ అని వెనకడుగేశా. ఎందుకంటే అప్పటికీ నా బరువు108 కిలోలు. అంతకంటే ఎక్కువ అయితే ఏదైనా జరగొచ్చు. తేడా వస్తే మళ్లీ తగ్గడం చాలా కష్టమైపోతుందని భయపడ్డా.

ఇన్​స్పైర్ చేయగలుగుతున్నా 

సోషల్​ మీడియాలో చాలామంది పెట్టే కామెంట్స్ చదివి నవ్వుకుంటా. మొదట్లో వాళ్ల మాటలకు చాలా బాధ కలిగేవి. ఇప్పుడు అలా ఏం లేదు. వాళ్లకు నా రియల్ లైఫ్ స్టయిల్​ ఏంటో తెలియదు కదా. అందుకని నెగెటివ్​ కామెంట్స్, ట్రోల్స్​ పట్టించుకోను. నేను నా శరీర బరువు విషయంలో చాలా హ్యాపీగా, కంఫర్టబుల్​గా ఉన్నా. చాలామంది నన్ను ఇన్​స్పిరేషన్​గా తీసుకుంటున్నట్టు మెసేజ్​లు చేస్తున్నారు. అలాంటివాళ్లను నేను అస్సలు డిజప్పాయింట్ చేయదలుచుకోలేదు. 

246 టేక్స్ తీసుకున్నా!

‘రాకీ ఔర్ రాణీ’లో ఆఫర్ వచ్చినప్పుడు నా మొదటి ప్రాజెక్ట్​ లాంటి పాత్రే కదా. పైగా నేను లావుగా ఉన్నానని అనిపించుకునే పాత్ర అని వద్దని చెప్పా. తర్వాత నాకు కరణ్​ స్టోరీ చెప్పి, నా పాత్ర గురించి వివరించినప్పుడు ఇలాంటి రోల్ చేయాల్సిందే అనిపించింది. అందుకే అందులో నటించా. నిజానికి ఆ సినిమాలో నటించడం వల్లే నాకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. గుర్తింపు కూడా పెరిగింది. అయితే టెలివిజన్​లో చేసేటప్పుడు15 పేజీల డైలాగులు కూడా ఈజీగా చెప్పేదాన్ని. 

అలాంటిది రాకీ ఔర్ రాణీ ఆడిషన్​లో మాత్రం ఇచ్చిన నాలుగు లైన్లు చెప్పడానికి 246 టేక్స్ తీసుకున్నా. దానికి కారణం అంత మంచి ప్రాజెక్ట్​లో ఉన్నందుకు నా ఎగ్జైట్​మెంట్ అలా ఉండేది. దాంతోపాటు ఇది సరిగా చేయలేకపోతే ఈ అవకాశం కోల్పోతానేమో అనే టెన్షన్, నెగెటివ్ ఆలోచనలతో ఒక్కసారిగా డిజప్పాయింట్ అయ్యేదాన్ని. అలా మెంటల్​గా చాలా డిస్టర్బ్ అయ్యా. ఎట్టకేలకు ఆడిషన్ క్రాక్ చేశా. సినిమా రిలీజ్ అయ్యాక చూసి నమ్మలేకపోయా. అంత సంతోషాన్నిచ్చింది ఆ పాత్ర. 

డబ్బా కార్టెల్​కి సీక్రెట్ ఆడిషన్​

‘రాకీ ఔర్ రాణీ’లో నన్ను చూసి ‘డబ్బా కార్టెల్​’లో అవకాశం ఇచ్చారు. అదొక ఇంట్రెస్టింగ్​ స్టోరీ.. షూటింగ్ మొదలయ్యే నాలుగు రోజుల ముందు నేను ఈ టీంలోకి వచ్చా. అంటే ఈ టీంలో చివరిగా చేరింది నేనే. కానీ, అప్పటికి ఏడెనిమిది నెలల ముందే ఈ పాత్రకు ఒకరిని ఎంపిక చేశారు. షూటింగ్​ కోసం వెయిటింగ్​. అలాంటి సమయంలో ఒకరోజు సాయంత్రం టీం నుంచి కాల్ వచ్చింది. అప్పటికీ నేను వేరే వర్క్​ చేసి, అలసిపోయి ఉన్నా. 

అవతలి వాళ్లు ఇలా నెట్​ఫ్లిక్స్​లో సిరీస్​, కాస్ట్​ పెద్ద యాక్టర్స్ ఉన్నారు. లీడ్​ రోల్స్​లో ఒకటి మీరు చేస్తారా.. అని అడిగారు. అదంతా వినగానే వెంటనే చేస్తానని మాటిచ్చా. అయితే ఈ సిరీస్​కి నా ఆడిషన్ చాలా సీక్రెట్​గా జరిగింది. ఎవరికీ తెలియదు. ఫైనల్​గా సెలక్ట్ అయ్యాక షాహిదా పాత్రలో నాపేరు అనౌన్స్ చేశారు.