బ్లడ్ క్యాన్సర్ తో చిన్నారి వెత

  •     ట్రీట్మెంట్ కు రూ.40లక్షలు
  •     సాయం కోసం ఎదురుచూపులు

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన టేకు శ్రీనివాస్, తిరుపతమ్మ దంపతుల కూతురు అంజలి(13) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. స్థానిక ప్రభుత్వ బడిలో 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారికి నెల రోజుల కింద నోరు, ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. టెస్టులు చేసిన డాక్టర్లు బ్లడ్ క్యాన్సర్ గా తేల్చారు. ట్రీట్ మెంట్ కోసం రూ.40లక్షలు అవసరం అవుతాయని తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీనివాస్.. తన కూతురిని ఎలా బతికించుకోవాలో తెలియక సతమతవుతున్నాడు.

ఇప్పటికే తెచ్చిన అప్పులు వైద్య ఖర్చులకు అయ్యాయని వాపోతున్నాడు. దాతలు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. సాయం చేయాలనుకున్న వారు 9704129710 నంబర్ కు కాల్ చేయాలని కోరుతున్నాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్థానిక ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడారు. అంజలిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.