హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తే.. ఈటల పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తో కలిసి ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో అంజన్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విడదీసి పాలించే బీజేపీలో చేరిన ఈటల.. రేవంత్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మల్లు రవి అన్నారు.
భాగ్యలక్ష్మి దేవాలయాన్ని రాజకీయాల్లోకి తెచ్చిందే బీజేపీ నేతలు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లోని మెజారిటీ నాయకులు ఎన్నుకుంటే రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారని పేర్కొన్నారు. దయాకర్ మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలతో రేవంత్‌ను కన్నీళ్లు పెట్టించే వరకు తీసుకొచ్చారని ఈటలపై ఫైర్ అయ్యారు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడారన్నారు. అసెంబ్లీలో ఈటలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పొగిడి మాట్లాడినప్పుడే ఆయన ఏ పార్టీకి తొత్తో అర్థం అయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ, ఈటల అవినీతిపరుడని, స్వార్థపరుడని అన్నారు. ప్రజల కోసం రేవంత్ కొట్లాడినందుకే ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిందన్నారు. ఈటల రెడ్డినా.. బీసీనా చెప్పాలని ఆయన నిలదీశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన పేపర్లపై సంతకాలు పెట్టి నిధులు విడుదల చేసిందే ఈటలే అని, అవినీతిలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.