నవ భారత నిర్మాత పటేల్

చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పుడు చరిత్రను రాయడానికి సమయం వృథా చేయడమేంటి అన్న ఒక్క మాట చాలు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత ఏ పాటిదో అర్థం చేసుకోవడానికి. రాజకీయ చతురతలో, పోరాట పటిమలో ఆయనది భారతదేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమం విస్తరిస్తున్న సమయంలో గాంధీజీ విధానాలకు కార్యాచరణకు ప్రభావితమై రెండు చేతుల సంపాదించే అవకాశం ఉన్నా వదులుకున్నారు. అహింసాయుత మార్గంలో సహాయ నిరాకరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తుంగా తరంగమై భరతజాతి దాస్య శృంఖాలాలను ఛేదించుకొని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించడంలో భాగమయ్యారు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా 565 రాజరిక సంస్థానాలను సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించడంలో, ఈ దేశాన్ని ఏక ఖండంగా నిలబెట్టడంలో సమైక్యత సార్వభౌముడయ్యాడు. దేశ అభివృద్ధికి ఏడు దశాబ్దాలు నాడే బీజం వేశాడు.

పట్టుదలకు ప్రతిరూపం..

భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ లోని నదియాద్ లో 1875 అక్టోబర్ 31న లాడ్ బాయ్, ఝవేరి బాయి పుణ్య దంపతులకు జన్మించారు. ఆలస్యంగా 22 ఏండ్ల వయసులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఈ సాదాసీదా యువకుడు అనుకుంటే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టని గట్టి పట్టుదల గల వ్యక్తి. 36 ఏండ్ల వయసులో లండన్ వెళ్లి మూడేండ్ల న్యాయవిద్యను 30 నెలల్లో పూర్తిచేసి భారతదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తి చేపట్టి అనతికాలంలోనే పేరెన్నికగన్న న్యాయవాదుల్లో ఒకరయ్యారు. ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజలను స్వరాజ్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి తొలి యుద్ధభూమి గుజరాత్ లోని బర్దోలీలో  రైతులతో చేయించిన సత్యాగ్రహం దేశ స్వాతంత్ర ఉద్యమ గతిని మార్చిన కీలక ఘట్టం. శాంతియుతంగా జరిగిన ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి రైతుల శిస్తు పెంపును వాయిదా వేసింది. పటేల్ కు సర్దార్ అనే బిరుదును తెచ్చిపెట్టింది ఆ ఘటన.1920లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన స్వాతంత్ర్య ఉద్యమానికే పరిమితం కాకుండా అంటరానితనం, కుల వ్యవస్థ మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. 1923లో నాగపూర్ లో సత్యాగ్రహం ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సర్దార్ పటేల్ ఎన్నికయ్యారు. 1940లో ఆంగ్లేయులు ఆయనను ఖైదు చేశారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 

ఉక్కు సంకల్పంతో నవభారతం..

ముక్కలు చెక్కలుగా విడిపోయి సంస్థానాధీశుల చేతిలో ఉన్న భారతదేశాన్ని ఏకం చేసిన ఘనత సర్దార్ పటేల్ సొంతం. సంస్థానాల శాంతియుత విలీనం అనేది స్వతంత్ర భారత నిర్మాణంలో తొలి, అతిపెద్ద అడుగు. 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతావనిలో సమస్యలు స్వాగతం పలికాయి. ఆసేతు హిమాచలం విశాల భారతావని నిండా పరుచుకున్న 565 రాజరిక సంస్థాలను ఏమి చేయాలో ఎవరికీ తోచలేదు. ఈ సమస్యను పటేల్ ఒక సవాలుగా స్వీకరించారు. సంస్థానాల విలీన కార్యక్రమానికి పూనుకున్నాడు. విలీన క్రమంలో ఆయన ప్రదర్శించిన విజ్ఞత అపూర్వమైనది. భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చింది. 2014 నుంచి పటేల్​ జన్మదినాన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నది. దేశ సమైక్యత కోసం నిరంతరం శ్రమించిన ఆయనకు నివాళిగా, ఆ మహనీయుడు ఖ్యాతిని అంతర్జాతీయంగా చిర స్థాయిగా నిలపాలనే ఉద్దేశంతో 2013 అక్టోబర్ 31న పటేల్ 138వ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ లో నర్మదా తీరంలో ప్రపంచంలో అతిపెద్దదైన597 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. ఆయన నేలకొల్పిన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను పటిష్టపరిచి సమర్థ పాలన, శాంతిభద్రతలు కల్పించే విధంగా భారత ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆయన త్యాగనిరతి, విలువలను  పాఠ్యపుస్తకాల ద్వారా బావి తరాలకు తెలియజేయాలి. - అంకం నరేష్, రాష్ట్ర కో కన్వీనర్, యూఎఫ్ఆర్టీఐ