భారత మాజీ కెప్టెన్.. దిగ్గజ బ్యాటర్ సౌరవ్ గంగూలీ రికార్డును 10వ తరగతి విద్యార్థి అంకిత్ ఛటర్జీ బ్రేక్ చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. హర్యానాతో మ్యాచ్ లో బరిలోకి దిగిన అతను.. బెంగాల్ తరపున అతి చిన్న వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. హెయిర్‌లైన్ ఫ్రాక్చర్‌తో అభిమన్యు ఈశ్వరన్ గాయంతో రిటిక్ ఛటర్జీతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాల్సిందిగా అంకిత్‌ను అడగడంతో రంజీల్లో ఈ యువ క్రికెటర్ అరంగేట్రం చేశాడు.
ALSO READ | Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ ఆడేది అనుమానమే
సౌరవ్ గంగూలీ 17 సంవత్సరాల వయస్సులో 1989-90 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. 35 ఏళ్ళ తర్వాత అంకిత్ ఛటర్జీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. హర్యానా ఆలౌట్ కావడంతో తొలి రోజు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంకిత్.. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. అతను శ్యాంబాజార్ క్లబ్ తరపున ఆడాడు. ఈ క్లబ్ పాఠశాల నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15 ఏళ్ళ వయసులో అద్భుతంగా రాణించి బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా 157 పరుగులకు ఆలౌట్ అయింది. సింధు జైస్వాల్ 6 వికెట్లు తీసి హర్యానాను కుప్పకూలేలా చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగాల్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఓపెనర్ ఛటర్జీ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. క్రీజ్ లో అంకిత్ ఛటర్జీ (5), రోహిత్ కుమార్ (0) ఉన్నారు. ప్రస్తుతం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 151 పరుగులు వెనకబడి ఉంది.