ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు ..శ్రీ వేంకటేశ్వరస్వామివారి మంగళకరమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ( సెప్టెంబర్ 17)న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సోమవారం ( సెప్టెంబర్ 18) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18వ తేది రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. 18వ తేదీ నుంచి నుంచి తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు 16 వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.
తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనుంది. సిఫార్సు లేఖలపై వసతి గదులు కేటాయింపు విధానాన్ని రద్దు చేశారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన గదులు కేటాయింపు జరగనుంది.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.