
చెన్నై: తమిళనాడు పాలిటిక్స్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోన్న ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై అధికారికంగా ధృవీకరించారు. తాను మళ్లీ అధ్యక్ష పదవి రేసులో లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని.. ఇందులో భాగంగా పార్టీలో కీలక మార్పులు చేస్తోందని గత కొన్ని రోజులుగా స్టేట్ పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం జరుగుతోంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కకు తప్పిస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం (ఏప్రిల్ 4) కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు బీజేపీలో ఎలాంటి పోటీ లేదు. తదుపరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈ సారి నేను బీజేపీ రాష్ట్ర నాయకత్వ రేసులో లేను. తమిళనాడు బీజేపీలో సమర్థవంతమైన నేతలు ఉన్నారు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ తమిళనాడు బీజేపీ చీఫ్ ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది.
2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో తమకు కొరకరాని కొయ్యగా మారిన డీఎంకే పార్టీకి కళ్లెం వేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను మట్టికరిపించాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లురుతోంది. ఈ క్రమంలోనే తన పాత మిత్రుడైన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని బీజేపీ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా భేటీ అయ్యి.. పొత్తు అంశంపై చర్చలు జరిపారు.
బీజేపీతో కలిసి పని చేసేందుకు అంగీకరించిన పళనిస్వామి.. బీజేపీ హైకమాండ్ ముందు కొన్ని కండీషన్లు పెట్టినట్లు టాక్. అందులో అతి ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి అన్నామలైను తొలగించడం. ఎందుకంటే అన్నామలైకు అన్నాడీఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. తమిళనాడు బీజేపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అటు అధికార డీఎంకేతో పాటు ఇటు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీపై అన్నామలై నిప్పులు చెరిగారు. అన్నాడీఎంకే అత్యంత అవినీతి పార్టీ అంటూ విమర్శల వర్షం గుప్పించారు.
ఈ క్రమంలో అన్నామలై, అన్నాడీఎంకే నేతల మధ్య మాటల యుద్ధమే నడించింది. అన్నామలై తీరుతో బీజేపీ ఫ్రెండ్ షిప్‌కు అన్నాడీఎంకే గుడ్ బై చెప్పింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగానే పోటీ చేశాయి. కానీ తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తమిళనాడు అధికార డీఎంకే పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
జాతీయ నూతన విద్యా విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలపై డీఎంకే దేశంలోని అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఎలాగైనా డీఎంకే, స్టాలిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే 2026లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేను ఓడించడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహాంలో భాగంగానే డీఎంకేను ఎదుర్కొనేందుకు అన్నాడీఎంకేతో మరోసారి చేతులు కలపాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు రంగంలోకి దిగిన అమిత్ షా.. పళనిస్వామితో మాట్లాడి డీల్ సెట్ చేసినట్లు టాక్. ఈ ఒప్పందంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తొలగించాలన్న పళనస్వామి డిమాండ్ కు బీజేపీ ఒకే చెప్పినట్లు తెలిసింది. దీంతోనే అన్నామలై అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.