తమిళనాడులో వర్ధమాన బీజేపీ స్టార్ అన్నామలై. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువగా తమిళనాట వార్తల్లో, చర్చల్లో నిలిచిన వ్యక్తి. ప్రజాకర్షణ ఉన్న అన్నామలై లాంటి బీజేపీ నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ బీజేపీ నాయకగణంలో లేడు. 2019 వరకు తెలంగాణలో బీజేపీ ఎదగలేదు. తద్వారా ఒక చిన్న కోటరీ నాయకులు అంతా ఆనందించారు. ఒక్కసారి పార్టీ ఎదుగుతుంటే నాయకులు పెరుగుతారు వారి ఆశయాలు పెరుగుతాయి.
అన్నామలై వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఆయన ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ సర్వీసుకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అన్నామలై తమిళనాడులో తన సొంత ప్రయత్నాల ద్వారా అఖిల భారత నాయకుడిగా ఎదిగాడు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని తన బ్యానర్‌లో నడిపించడంతో భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ బలపడింది. అయితే, ఇతర పార్టీలు మాత్రం రాష్ట్రాల వారీగా ఎదగాలంటే ఆ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి నాయకత్వం అవసరం. పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు, కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కారణంగా కేరళలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదేవిధంగా కల్యాణ్ సింగ్ వల్ల ఉత్తరప్రదేశ్‌లో, బైరాన్ సింగ్ షెకావత్ కారణంగా రాజస్థాన్‌లో బీజేపీ పెరిగింది.
దక్షిణాదిలో బీజేపీ అలుపెరగని పోరాటం
దక్షిణాది రాష్ట్రాల్లో 130 మంది ఎంపీలు ఉన్నారు. అయితే, కర్నాటకలో మాత్రమే బీజేపీ గణనీయంగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటోంది. దక్షిణ భారతదేశంలో పెరగడానికి బీజేపీ అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అన్నామలై రంగప్రవేశం చేసేవరకు దక్షిణాది రాష్ట్రాలను ప్రభావితం చేసిన నాయకుడు లేని లోటు కనిపించింది. తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడులో అన్నామలై స్థాయిలో ప్రజాకర్షణ ఉన్న బీజేపీ నాయకుడు లేడు. ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఎదగాలంటే ఆ పార్టీకి బలమైన ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కావాలి.
ధైర్యమే ఐకాన్‌గా మార్చింది
ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఆర్థికమంత్రి పీటీఆర్‌కు చెందిన రహస్య వీడియోను అన్నామలై విడుదల చేసినప్పుడు, మొత్తం రాజకీయ రంగంలో కలకలం రేగి షాక్‌కు గురైంది. పీటీఆర్ సంఘటన తమిళనాడును షేక్ చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు అభద్రతా భావానికి గురయ్యాడు. డీఎంకేను, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులను అన్నామలై ధైర్యంగా విమర్శించాడు. ప్రధాని నరేంద్ర మోదీపై లేదా హిందూ మతంపై దాడి చేస్తే ధైర్యంగా ప్రతివిమర్శలు చేసి ఎదుర్కొన్నాడు. ఇది అన్నామలైని తమిళనాడులో బీజేపీ ఐకాన్‌గా మార్చింది. కాగా, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ సులభంగానే అభివృద్ధి చెందుతుంది. అయితే, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట బీజేపీ ఎదుగుదల చాలా కష్టం. అయినప్పటికీ, అన్నామలై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమిళనాడు అంతటా భారీ ఆదరణ కూడగట్టుకున్నారు.
బీజేపీని రేసులో నిలిపాడు
1967 నుంచి తమిళనాడులో డీఎంకే లేదా ఏడీఎంకే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి తమిళంలో జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ తదితర పార్టీలు మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. బీజేపీకి పొలిటికల్కరిష్మా పెరగడంతో తమిళనాడులో కొత్తవారు కమలం పార్టీలో చేరడం ప్రారంభించారు. అది బీజేపీకి కొత్త శక్తిని ఇచ్చింది. 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని, 39 మంది ఎంపీల్లో 10 ఎంపీలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకోవచ్చని కొద్దిరోజుల క్రితం అన్నామలై ప్రకటించారు. అన్నామలై ఈ సంఖ్యను సాధిస్తారా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ, అన్నామలై మాత్రం బీజేపీని ఆశ్చర్యపరిచే విధంగా తమిళనాడులో రాజకీయ రేసులో నిలిపారనేది యధార్థం.
అన్నామలై అనుకూల అంశాలు
అన్నామలై యువ నాయకుడు. ఐపీఎస్అధికారిగా అతని నేపథ్యం రాజకీయ నాయకులను ఎదుర్కొనడంలో గొప్పగా సహకరించింది. ఏ తమిళ రాజకీయ నాయకుడికీ ఆయన భయపడలేదు. అన్నామలైకి డీఎంకే, ఏడీఎంకే, ఇతర పార్టీలన్నీ కుటుంబ లేదా ఏకవ్యక్తి పార్టీలేనని అర్థమైంది. అందుకే యువతను, అందరినీ బీజేపీకి మద్దతివ్వాలని ఆహ్వానించి వేలాది మంది కొత్త నాయకులను తయారు చేశాడు. ద్రవిడ భావజాలం 110 ఏండ్లకు పైబడినదని అన్నామలై కూడా అర్థం చేసుకున్నాడు.
అన్నామలైకు ప్రతికూలతలు
తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పూర్తిస్థాయిలో ఎదగడానికి ఇంకా సమయం పడుతుంది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం కూడా ముఖ్యం. అప్పుడు అన్నామలై బీజేపీని చాలా వేగంగా అభివృద్ధి చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోరుకోవచ్చు. జూన్ 4 ఫలితాలు అన్నామలై రోడ్-మ్యాప్‌ను నిర్ణయిస్తాయి. అన్నా
మలైకి మోదీ దన్నుబ్రాహ్మణ వ్యతిరేక లేదా హిందూ వ్యతిరేక ఉద్యమాల సెంటిమెంట్ చాలాకాలం క్రితం ముగిసింది. యాదృచ్ఛికంగా డీఎంకే 1967లో బ్రాహ్మణ రాజగోపాలాచారి ( రాజాజీ) పొత్తులతో అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో బీజేపీని విస్తరించాలని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోదీ తమిళనాడు ప్రజలకు సుపరిచితుడు కావడం
అన్నా మలైకి సహాయపడింది.
పైగా అన్నామలైకి బీజేపీ హైకమాండ్ పూర్తిగా మద్దతిస్తోంది. కాబట్టి ఆయనకు బలం, బలగం రెండూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి కేవలం 3% ఓట్లు మాత్రమే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడం సులభంగానే కనిపిస్తోంది.
అదృష్టమూ కలిసిరావాలి
రాజాజీ, కామరాజ్, అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తదితరులు రాజకీయ రంగంపై తమదైన ప్రభావాన్ని చూపారు. తమిళనాడు హీరోలను ఎక్కువగా ఆరాధించే రాష్ట్రం. అన్నామలై కూడా కచ్చితంగా హీరో అనే చెప్పాలి. అన్నామలైలో కచ్చితంగా ప్రజాకర్షణ, ధైర్యం, తెలివితేటలు ఉన్నాయి. అదృష్టం కూడా విజయానికి అత్యంత ముఖ్యమైన అంశం. గ్రేట్ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను 200 సంవత్సరాల క్రితం పోరాడటానికి ఎలాంటి జనరల్స్ కావాలి? అని అడిగితే నెపోలియన్ ‘లక్కీ జనరల్స్’ అని బదులిచ్చాడు. అన్నామలైకి అనుకూలంగా ఉండే ఓ సామెత కూడా ఉంది. ’ ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది’. అన్నామలై కచ్చితంగా ధైర్యవంతుడు.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్