అన్నామలై, తమిళిసై గృహ నిర్బంధం

అన్నామలై, తమిళిసై గృహ నిర్బంధం
  • వందల మంది బీజేపీ కార్యకర్తలు కూడా పోలీసుల అదుపులోకి
  • లిక్కర్ స్కామ్​పై నిరసన ప్రదర్శనకు ముందు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు  చేసిన పోలీసులు
  • స్టాలిన్  సర్కారుది పిరికి చర్య:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

చెన్నై:  తమిళనాడు బీజేపీ చీఫ్​ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్  తమిళిసై సహా కొన్ని వందల మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు సోమవారం ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు స్టేట్  మార్కెటింగ్  కార్పొరేషన్  లిమిటెడ్  (టాస్మాక్) లిక్కర్  స్కామ్ పై సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని బీజేపీ నేతలు ప్లాన్  చేసుకున్నారు. 

అయితే, ఉదయం 11 గంటలకు పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అన్నామలై, తమిళిసైని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ స్టాలిన్  సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘స్టాలిన్  ప్రభుత్వం మమ్మల్ని కదలనీయడం లేదు. మా కార్యకర్తలు 3 వందల మందిని ఓ మ్యారేజ్  హాల్ లో ఉంచారు. రూ.వెయ్యి కోట్ల లిక్కర్  స్కామ్ ను మేము ఖండిస్తున్నాం. 

ఈ స్కామ్ పై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపాలి” అని తమిళిసై పేర్కొన్నారు. స్టాలిన్  సర్కారుది పిరికి చర్య అని అన్నామలై ‘ఎక్స్’ లో మండిపడ్డారు. ‘‘సోమవారం మేము నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రభుత్వానికి తెలుసు. అందుకే మమ్మల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఒకవేళ మేము టైమ్  చెప్పకుండా అకస్మాత్తుగా ప్రదర్శన నిర్వహిస్తే ఏంటి పరిస్థితి?” అని అన్నామలై నిలదీశారు.