కరెంట్​ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు

  • ప్రతి ఎంప్లాయీ హెడ్​ క్వార్టర్​లోనే ఉండాలి
  • టీఎస్​ ఎన్​పీడీసీఎల్​ సీఎండీ అన్నమనేని గోపాలరావు

హనుమకొండ, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతీ సర్కిల్ పరిధిలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేయాలని,  ప్రతీ ఎంప్లాయీ హెడ్​ క్వార్టర్స్​లో ఉంటూ సేవలందించాలని టీఎస్​ ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు ఆదేశించారు.   ఎన్​పీడీసీఎల్​ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్​ఈలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​కు సంబంధించి మెన్, మెటీరియల్​ను  సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.  ఎక్కడైనా అత్యవసర సేవలు అవసరమైతే  వెంటనే స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  నది పరివాహక ప్రాంతాల్లో  విద్యుత్ సంస్థకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని, ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.  

గోదావరి తీర ప్రాంతాలైన భద్రాచలం, భూపాలపల్లి, మంథని పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ విద్యుత్ అంతరాయాలు లేకుండా సరఫరా అందించాలన్నారు.  కస్టమర్లు విద్యుత్​ సంబంధ సమస్యలు ఎదురైతే వెంటనే  టోల్ ఫ్రీ నెంబరు 1800  425 0028 కు లేదా 1912 కు కాల్​ చేసి సమాచారం అందించవచ్చన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు  బి. వెంకటేశ్వర రావు,  పి.గణపతి,  పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, వి.తిరుపతి రెడ్డి,  16 సర్కిళ్ల ఎస్​ఈలు పాల్గొన్నారు.