అభివృద్ధికి దూరంగా అన్నపురెడ్డిపల్లి ఆలయం

అన్నపురెడ్డిపల్లి/చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నపురెడ్డిపల్లి శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది ఎకరాల భూములున్నా పదేళ్లుగా పాలకవర్గం లేక అభివృద్ధి చెందడం లేదు. ఆలయానికి ఏడేళ్లుగా ఇన్ చార్జి ఈవోలే దిక్కవుతున్నారు. ఈ ఆలయానికి 2264 ఎకరాల భూములున్నాయి. ఆలయంలో12 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఏడాదికి ఆలయానికి భూముల కౌలు ద్వారా రూ.35 లక్షలు ఆదాయం రావాల్సి ఉంది. వీటిని గిరిజన, గిరిజనేతరులు సాగు చేస్తున్నారు. కౌలుదారులు సక్రమంగా కౌలు చెల్లించని కారణంగా ఏడాదికి రూ.15లక్షల వరకు బకాయిలు ఉంటున్నాయని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. కరెంట్ బిల్లులు, బ్రహ్మోత్సవాలకు, ప్రతీ శనివారం కల్యాణం, పండుగలు వంటి సమయాల్లో ఆలయ హుండీ, కౌలు ఆదాయాలను వెచ్చిస్తుంటారు. ప్రస్తుతం ఆదాయ, వ్యయాలు సమానంగా ఉండడంతో అభివృద్ధికి నిధులు లేకుండాపోతున్నాయి. ఆలయానికి పాలకవర్గం లేక ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా నిర్ణయాలు తీసుకోలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 

సీతారామ కాలువ ముంపు వివాదం..

బాలాజీ ఆలయానికి చెందిన భూములు అన్నదైవం రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు కాల్వ ముంపు పరిహారం వివాదంగా మారింది. కాల్వ నిర్మాణంలో సర్వే నంబర్​39లో17 ఎకరాల భూమి ముంపునకు గురైంది. ప్రభుత్వం ఎకరానికి రూ.8 లక్షలు పరిహారంగా ప్రకటించింది. ఈ క్రమంలో రూ.1.36 కోట్లు ఆలయానికి రావాల్సి ఉంది. కాని ఇదే భూమి రెవెన్యూ ఆఫీసర్ల సర్వేలో 40 సర్వే నంబర్​లోనిదిగా తేలింది. రికార్డు ప్రకారం ఆ రెండు సర్వే నంబర్ల భూములన్నీ ఆలయానికి చెందినవేనని సిబ్బంది చెబుతున్నారు. అవి తమవని, ఆలయానికి చెందినవి కావని పట్టాదారులైన పలువురు రైతులు అంటున్నారు. దీంతో పరిహారం చెల్లింపు వివాదంగా మారడంతో పెండింగ్ లోనే ఉంది.

కుంటుపడుతున్న అభివృద్ధి..

బాలాజీ ఆలయానికి పాలకవర్గం లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ భూముల కౌలు వసూళ్లలో సిబ్బంది కౌలుదారులపై ఒత్తిడి తేలేక ఇచ్చినంత తీసుకోవాల్సి వస్తోంది. నికర ఆదాయ వనరులుగా ఉండేందుకు ఆలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. గతంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి అన్నపురెడ్డిపల్లిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.కోటి అంచనాలతో చేసిన ప్రపోజల్ ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల పుణ్య స్నానాలు చేసేందుకు కోనేరు నిర్మించాలనే ఆలోచన కార్యాచరణకు రాలేదు. ఆలయ భూముల సరిహద్దుల గుర్తింపు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. గతంలో ఆలయానికి చెందిన 80 ఎకరాల టేకు ప్లాంటేషన్ కు కటింగ్ పర్మిషన్ రాక దొంగల పాలైన సంఘటనలున్నాయి. ఇప్పటికైనా పాలకవర్గాన్ని నియమించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. పాలకవర్గం ద్వారానే అభివృద్ధి నిర్ణయాలు సాధ్యమవుతాయని సిబ్బంది అంటున్నారు.

పాలకవర్గం ఉంటేనే అభివృద్ధి...

వేలాది ఎకరాలున్న అన్నపురెడ్డిపల్లి బాలాజీ ఆలయానికి పాలకవర్గం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదనలు పంపేందుకు పాలకవర్గం కీలకం. గతంలో తాను చైర్మన్ గా పని చేసిన సమయంలో నియమించిన వాహనకారులకు పర్మినెంట్ అయింది. ఆలయ భూముల కౌలు వసూళ్లలో పాలకవర్గం సాయంతో వందశాతం వసూళ్లు చేయవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమించాలి.
–బోయినపల్లి సుబ్బారావు,  ఆలయ కమిటీ మాజీ చైర్మన్