మానేరులోకి అన్నారం బ్యాక్​వాటర్.. పొలాల్లో ఇసుక మేటలు

  • సాగుకు పనికిరాకుండా పోయిన పంట పొలాలు
  • వరద అంచనాపై ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని రైతుల డిమాండ్​

పెద్దపల్లి, వెలుగు:  అన్నారం బ్యారేజీ బ్యాక్​ వాటర్​తో ఇటీవల మానేరు వాగు పొంగి ముత్తారం మండలంలోని ఓడేడ్, ఖమ్మంపల్లి  గ్రామాలకు చెందిన పంట పొలాలన్నీ నీటమునగడంతో పాటు ఇసుక మేటలు వేశాయి. వందల ఎకరాల్లో పంట భూములన్నీ పాడైపోయాయి. ఇప్పట్లో ఆ భూములు సాగుకు పనికిరావని రైతులు వాపోతున్నారు.  ఇసుకను తరలించి భూములను సాగుకు తీసుకురావాలంటే  రూ. లక్షల్లో ఖర్చు అవుతుందంటున్నారు. ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.  మానేరులో వరద వచ్చే సమయానికి దగ్గరలోని ఇసుక క్వారీలో  కూలీలు పనులు చేస్తున్నారు.  చాలా మంది రైతులతో పాటు క్వారీ కూలీలు కూడా వరదల్లో చిక్కుకున్నారు. 

మహారాష్ట్రతో పాటు  మంచిర్యాల జిల్లాలో పడ్డ వానలకు గోదావరిలో నీటి మట్టాలు పెరిగిపోయాయి.  దానికి తోడు ములుగు,  భూపాలపల్లిలో అధికంగా కురిసిన వానలకు,  మానేరుకు అవతల వైపున్న  మోరంచ వాగు ఉధృతి పెరిగిపోయి మానేరులోకి దూసుకొచ్చింది.  మరో వైపు బ్యారేజీల గేట్లు ఎత్తినప్పటికీ  వాటర్​ వెనక్కి తన్నడంతో మానేరు పోటెత్తింది.  దీంతో మానేరు పరిసర మండలం ముత్తారంలోని భూములన్నీ నీట మునిగిపోయాయి. వరద తీవ్రతను ఆఫీసర్లు అంచనా వేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని  రైతులు ఆరోపిస్తున్నారు.

గంటలోనే అస్తవ్యస్తం..

పెద్దపల్లి జిల్లాలో  గడిచిన15 రోజులుగా వర్షపాతం తక్కువగానే ఉంది.  పైనుంచి వరద తక్కువగానే వస్తోంది.   ఎల్ఎండీ గేట్లు కూడా ఎత్తలేదు.   గత నెల 27 న మానేరు ప్రశాంతంగా ఉన్న  టైంలో  అన్నారం బ్యాక్​ వాటర్​ మానేరు వాగులోకి వెనక్కి తన్నడంతో ఒక్కసారే మానేరు నీటి మట్టం పెరిగిపోయింది.  గంట వ్యవధిలోనే మానేరు వాగు ఉధృతికి వందల ఎకరాల భూములు నీట మునిగిపోవడంతో పాటు పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుకను పొలాల్లో నుంచి తొలగించి, మళ్లీ సాగుకు అనుకూలంగా ఆ భూములను తయారు చేయడానికి రూ. లక్షలు ఖర్చు అవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

పర్యవేక్షణ లేకనే..

మానేరు ముంపునకు గురి కావడానికి ఆఫీసర్ల పర్యవేక్షణ లోపమే అని రైతులు ఆరోపిస్తున్నారు.  నిరుటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మానేరు ప్రవాహాన్ని గుర్తించాల్సి ఉండగా, ఆఫీసర్లు అంచనా వేయలేకపోయారు. పెద్దపల్లిలో వర్షపాతం తక్కువ ఉండడంతో ప్రమాదం లేదని నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు ఆనుకొని ఉన్న మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా వానలు పడ్డాయి. ఈ క్రమంలో గోదావరిలోకి వరద తీవ్రంగా వచ్చి పడింది.  ఈ క్రమంలో బ్యారేజీల గేట్లు తీసినప్పటికీ, క్యాచ్​మెంట్​ ఏరియాల నుంచి వచ్చే వరదలను ఆఫీసర్లు గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో మానేరుకు అవతల వైపున ఉన్న మోరంచ వాగు తీవ్ర ఉధృతితో మానేరులో చొరబడింది. అలాగే మరోవైపు అన్నారం బ్యారేజీ కింద బ్యాక్​ వాటర్​ మానేరులోకి వెనక్కి తన్నింది. దీంతో ఒకేసారి మానేరులో నీటి ప్రవాహం పెరిగిపోయింది. వందల ఎకరాల్లో పంటలు ఇసుక మేటల కింద కూరుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

పది ఎకరాల పంట మునిగింది.. 

పది ఎకరాల పంట నీటిపాలైంది.  పొలం మొత్తం ఇసుక మేట వేసింది.  పంట పెట్టుబడి రూ.2 లక్షలు ఖర్చు అయింది. ఆఫీసర్లు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి​ పరిహారం అందించాలి.
- కట్కూరి రాజిరెడ్డి, రైతు, ఓడెడ్​

సర్కారే ఇసుక మేటలు తొలగించాలే..

ఇసుక మేటలు వేసిన భూములు సాగుకు పనికి రావు. ఇసుకను పొలాల్లో నుంచి తరలించి మళ్లీ పొలంగా మార్చాలంటే రూ. లక్షలు ఖర్చు అయితవి.  చేసుకుంటే బతికేటోళ్లం అంత ఖర్చు పెట్టలేం. సర్కారే ఆదుకొని ఇసుకను తొలగించి పొలాలను చదును చేయాలే. 
- పాల జంపులు, రైతు, ఓడేడ్​