- 21 గేట్ల వద్ద ప్యార్లల్ సీస్మిక్ వేవ్స్ టెస్ట్‌లు
- 16 గేట్ల వద్ద రాఫ్ట్, సీకెంట్ పైల్స్ బలహీనమని నిర్ధారణ
- ఐఎస్ కోడ్స్ సూచించిన ప్రమాణాలను అందుకోని నాణ్యత
- ప్లెయిన్ కాంక్రీట్, ఆర్సీసీల క్వాలిటీ తీసికట్టుగా ఉందని వెల్లడి
- గత ఆగస్టులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన అన్నారం బ్యారేజీ చాలా బలహీనంగా ఉన్నట్టు వెల్లడైంది. ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన బ్యారేజీని అత్యంత నాసిరకంగా నిర్మించినట్టు నిర్ధారణ అయింది. చాలా గేట్ల వద్ద రాఫ్ట్, సీకెంట్‌పైల్స్(బ్యారేజీ పునాది)ను అత్యంత నాసిరకంగా నిర్మించినట్టు తేలింది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) చేసిన స్టడీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పలు జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పుణెకి చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్తో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద జియో ఫిజికల్ టెస్టులు చేయించేందుకు అధికారులు నిర్ణయించారు. అన్నారం బ్యారేజీ వద్ద జియో ఫిజికల్ టెస్టులను చేయించారు. అందులో భాగంగా బ్యారేజీలోని 26 నుంచి 46వ నంబర్ గేట్ల వరకు మొత్తం 21 గేట్ల వద్ద ప్యార్లల్సీస్మిక్ టెస్ట్‌లను సీడబ్ల్యూపీఆర్ఎస్ చేసింది. టెస్టులు చేసిన 21 గేట్లలో 16 గేట్ల వద్ద ప్లెయిన్ కాంక్రీట్, ఆర్సీసీ (ఇనుముతో పటిష్టపరిచిన కాంక్రీట్)ని నాసిరకంగా తయారు చేసి రాఫ్ట్‌లు, సీకెంట్పైల్స్ను నిర్మించినట్టు తేటతెల్లమైంది.
నిర్ధారించిన ప్రమాణాలకంటే ఆ 16 గేట్ల నాణ్యత తీసికట్టుగా ఉందని వెల్లడైంది. దానికి సంబంధించిన మధ్యంతర రిపోర్ట్‌ను గత ఆగస్టులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సీడబ్ల్యూపీఆర్ఎస్ అందజేసింది. 35, 30, 32, 26,29, 34, 42, 27, 40, 44, 45, 46, 31, 38, 33, 43 గేట్ల వద్ద నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని, మిగతా గేట్ల వద్ద ఫర్వాలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నది.
ఎంత ఎక్కువ వేగం ఉంటే అంత ఎక్కువ నాణ్యత
ప్యార్లల్సీస్మిక్ టెస్టుల్లో ఐఎస్ 516:2018 కోడ్స్ ప్రకారం భూకంప తరంగాల వేగం ఎంత ఎక్కువుంటే ఆ నిర్మాణం అంత నాణ్యంగా ఉన్నట్టు సీడబ్ల్యూపీఆర్ఎస్ చెబుతున్నది. వేగం తక్కువుంటే ఆ నిర్మాణం నాసిరకమైనదని స్పష్టం చేస్తున్నది. అన్నారం బ్యారేజీ విషయంలో టెస్టులు చేసిన 21 గేట్లలో నాలుగైదు గేట్లను మినహాయిస్తే మిగతా చోట్ల సీస్మిక్ వేవ్స్ వేగం చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 16 గేట్ల వద్ద ఐఎస్ 516:2018 కోడ్స్‌కు అనుగుణంగా రిజల్ట్ రాలేదని సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక స్పష్టం చేసింది.
ప్లెయిన్ కాంక్రీట్‌తో పోలిస్తే ఐరన్‌తో పటిష్టపరిచిన ఆర్‌సీసీలో సీస్మిక్ వేగం 1.2 నుంచి 1.9 రెట్లు ఎక్కువగా ఉంటుందని, దానికి కారణం ఆర్సీసీలోని ఇనుములో తరంగాలు చాలా వేగంగా వెళ్తాయని, ఆర్‌సీసీలో ఎంత ఎక్కువ ఇనుమును వాడితే అంత ఎక్కువ వేగంతో ఆ తరంగాలు ప్రయాణిస్తాయని సీడబ్ల్యూపీఆర్ఎస్ చెబుతున్నది. ఇసుకలో అయితే ఆ తరంగాల వేగం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, అన్నారం బ్యారేజీలో ఇటు ప్లెయిన్ కాంక్రీట్తోపాటు ఆర్సీసీలోనూ ఐఎస్కోడ్స్ నిర్ధారించిన ప్రమాణాల మేరకు సీస్మిక్ వేగం లేదని నివేదికలో సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్ధారించింది.
సీస్మిక్ ప్యార్లల్ టెస్ట్ అంటే?
టెస్టులో భాగంగా బ్యారేజీ ఎగువన ప్రతి గేటు (వరద ప్రవాహం వెళ్లే వెంట్) కు సరిగ్గా మధ్యలో 11 మీటర్ల వెడల్పు, 9 నుంచి 13 మీటర్ల లోతుతో బోర్ హోల్స్ తవ్వుతారు. ఈ బోర్హోల్స్లోకి సీస్మిక్ వేవ్స్ (భూకంప తరంగాలు)ను శోషించుకుని రికార్డ్ చేసే చానల్ హైడ్రోఫోన్స్ను పంపిస్తారు. ఆ భూకంప తరంగాలు, వాటి వేగాన్ని లెక్కించేందుకు సీస్మోగ్రాఫ్తో హైడ్రోఫోన్స్ను అనుసంధానిస్తారు. బ్యారేజీ దిగువన (గేట్ల ముందు భాగంలో) ఒక్కో గేటు వద్ద రాఫ్ట్ మీద ఒక్కో మీటర్ దూరంతో 17 పాయింట్లను మార్క్ చేసి ఒక్కో పాయింట్ దగ్గర సుత్తితో కొడతారు.
అక్కడ భూకంప తరంగాలు ఏర్పడి కింద తవ్విన బోర్‌హోల్స్ లోపల ఉన్న హైడ్రోఫోన్స్ వరకు చేరుతాయి. తరంగాల వేగాన్ని సీస్మోగ్రాఫ్ రిసీవ్ చేసుకుని లెక్కిస్తుంది. అన్నారం బ్యారేజీ విషయంలో బోర్‌హోల్స్‌ను గేటును బట్టి 9.6 మీటర్ల నుంచి 13 మీటర్ల లోతు వరకు తవ్వారు. ఒక్కో గేటు వద్ద 17 భూకంప తరంగాల చొప్పున టెస్టులు చేసిన మొత్తం 21 గేట్ల వద్ద 4,284 భూకంప తరంగాల వేగాన్ని నిపుణులు లెక్కించారు.
ఐఎస్516:2018 కోడ్స్ సూచించిన ప్రమాణాలు ఇవి
ప్లెయిన్ కాంక్రీట్ వద్ద వేగం ఆర్‌సీసీలో వేగం కాంక్రీట్ నాణ్యతా గ్రేడింగ్
(మీటర్/సెకన్) (మీటర్/సెకన్)
4,400కుపైన 5,500కుపైన ఎక్స్లెంట్
3,750 నుంచి 4,400 4,680 నుంచి 5,500 గుడ్
3,000 నుంచి 3,750 3,750 నుంచి 4,680 నాసిరకం
3,000 కన్నా తక్కువ 3,750 కన్నా తక్కువ అత్యంత నాసిరకం