బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి..లేదంటే పార్టీ పరువు పోతది: మల్లికార్జున ఖర్గే

బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి..లేదంటే పార్టీ పరువు పోతది: మల్లికార్జున ఖర్గే
  • బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి
  • పార్టీ రాష్ట్రాల ఇన్​చార్జ్​లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హితవు
  • హామీలిచ్చేటపుడు జాగ్రత్త అవసరం
  • లేదంటే పార్టీ పరువు పోతుందని హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లు గ్యారంటీలు ఇవ్వొద్దని, తమ రాష్ట్రాల బడ్జెట్‌‌ను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారు. బడ్జెట్‌‌ ఆధారంగా ఎన్నికల హామీలివ్వాలని ఆదేశించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఆ రాష్ట్రాల పార్టీ నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్న కర్నాటకలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సేవలను అందించే శక్తి స్కీమ్​ను సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే కొంత అసహనం వ్యక్తం చేశారు. ‘‘కర్నాటక ఎన్నికల ప్రచార సమయంలో 5 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మిమ్మల్ని చూసి త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మన పార్టీ ఐదు గ్యారంటీలకు హామీ ఇచ్చింది. ఈ రోజు మీరేమో.. ఇచ్చిన ఐదింటిలో ఒకదాన్ని రద్దు చేస్తామని అంటున్నరు. మీరంతా న్యూస్ పేపర్లు చదవరనే అనిపిస్తున్నది. అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వివరిస్తున్నాను’’ అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేశారు.

ఆర్థిక సమస్యలు వస్తయ్

కాంగ్రెస్ చీఫ్​లు అందరూ.. తమ తమ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగి ఉండాలని ఖర్గే సూచించారు. ‘‘హామీలు ఇచ్చేటప్పుడు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇష్టమొచ్చినట్లు గ్యారంటీలు ప్రకటిస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. దివాలా తీస్తాం.. భవిష్యత్ తరాలపై దీని ప్రభావం ఉంటది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పార్టీ పరువు, ప్రతిష్ట పోతది. రోడ్లపై ఇసుక వేసేందుకు కూడా డబ్బులుండవు. రాబోయే పదేండ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రజల్లో పార్టీ మీదున్న నమ్మకం పోతది. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది వంటి గ్యారంటీలు ఇస్తామంటూ హామీలు ఇవ్వొద్దని మహారాష్ట్ర నేతలకు సూచిస్తున్న. మీ బడ్జెట్​కు అనుగుణంగా గ్యారంటీలు ఇవ్వండి’’అని ఖర్గే చెప్పారు. 

ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చారు

శక్తి స్కీమ్​పై రివ్యూ చేస్తామని మాత్రమే డీకే శివకుమార్ అన్నారని ఖర్గేకు సీఎం సిద్ధరామయ్య చెప్పగా.. ఆయన స్పందిస్తూ.. ‘‘మీరు చేసిన కామెంట్.. వాళ్లకు(బీజేపీ) మనపై విమర్శలకు అవకాశం ఇచ్చింది. హిమాచల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల హామీల గురించి ప్రస్తావిస్తున్నరు. ప్రజలను మోసం చేస్తున్నామని అంటున్నరు. నేను, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నరు’’ అని ఖర్గే ఫైర్ అయ్యారు.