అసంతృప్తులు కలిసొస్తారా.. వద్దన్న వారికే టికెట్లు

  • చొప్పదండి, మానకొండూరు, పెద్దపల్లి, మంథని, రామగుండం బీఆర్​ఎస్​ అభ్యర్థుల్లో టెన్షన్
  • జాబితా ప్రకటన తర్వాత అంతా సైలెంట్
  • అంతుచిక్కని అసమ్మతుల అంతరంగం అసంతృప్తులు కలిసొస్తారా!

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్​ప్రకటించాక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో అంతృప్తి గళాలు సైలెంట్​అయ్యాయి. అయితే అసంతృప్త లీడర్లు తమతో కలిసివస్తారా అని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న లీడర్లు ఇప్పుడు తమ విజయానికి ఎంతవరకు సహకరిస్తారోనని బీఆర్ఎస్​క్యాండిడేట్లు డైలమాలో ఉన్నారు. చొప్పదండి, మానకొండూరు, పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో టికెట్ల కోసం చాలా మంది ప్రయత్నించి కొందరు, క్యాండిడేట్లను మార్చాలని మరికొందరు పట్టుబట్టి భంగపడ్డారు. 

తాము వద్దన్నవారికే టికెట్లు దక్కాయని కొందరు, తమకు టికెట్ ఇవ్వలేదని మరికొందరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పెద్దపల్లి  టికెట్ రాకపోవడంతో నల్లా  మనోహర్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. ఉమ్మడి జిల్లాలోని మరికొందరు ఆశావహులు హైకమాండ్​హామీ కోసం వేచిచూసే ధోరణితో ఉన్నారు. ఎన్నికల నాటికి అసమ్మతి వర్గం తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందో లేదోనని ఈ ఐదు నియోజకవర్గాల క్యాండిడేట్లు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. మరోవైపు బీఫామ్ లు ఇచ్చేనాటికి కూడా కొన్ని మార్పులు ఉండొచ్చని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆశావహులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

ఆరేపల్లి ఏం చేయనున్నారు !

మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఈసారి తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించారు. కానీ ఇటీవల ప్రకటించిన జాబితాలో ఆయన పేరులేదు. మరుసటి రోజే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసినా కేవలం ఫొటో దిగి, ఎలాంటి హామీ లేకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడం, సీఎంను కలిసినా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత గూటికి వెళ్లడమా, లేదా బీజేపీలో చేరడమా లేదంటే ఇంకా ఏదైనా పార్టీ నుంచి పోటీ చేయడమా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రసమయిని ఓడించడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. 

నివురుగప్పిన నిప్పులా చొప్పదండి

చొప్పదండికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో మంత్రి గంగుల, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కరీంనగర్ లోని ఓ హోటల్​లో చివరికి ఎమ్మెల్యేకు, నేతలకు మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే ఎదుటే అసమ్మతి నేతలు ఆయన పనితీరుపై మండిపడ్డారు. ఆయనను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. 

కానీ చివరికి రవిశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే టికెట్ దక్కింది. దీంతో అప్పట్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేసిన నాయకులు డైలామాలో పడిపోయారు. వద్దన్న వ్యక్తికే టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ఆయన గెలుపు కోసం ఎలా పనిచేయాలని తలలు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకుడు బండపల్లి యాదగిరి రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఫామ్​ఇచ్చేదాకా ప్రయత్నిస్తానని సోషల్ మీడియా వేదికగా యాదగిరి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అసంతృప్తిలో పెద్దపల్లి నేతలు.. 

పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పలువురు బీఆర్ఎస్ నేతలు పలువురు టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ రాకపోయేసరికి తమ రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుచరులతో చర్చిస్తునారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ రాకపోవడంతో నల్లా  మనోహర్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్​కూడా టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానికి పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. 

అయినప్పటికీ ఎన్నికలనాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. రామగుండం నుంచి కందుల సంధ్యారాణి టికెట్ ఆశించారు. జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రెబల్ గా పోటీచేయడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంథని నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన చల్లా నారాయణరెడ్డికి నిరాశే ఎదురైంది. టిక్కట్ రాకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నియోజకవర్గంలో నెలకొంది. దీంతో అసంతృప్తులంతా సహకరిస్తారా.. తమకు వ్యతిరేకంగా పని చేస్తారా అన్న ఆందోళన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో నెలకొంది.