- సిద్దిపేట బీజేపీ క్యాండిడేట్
- ఆలస్యమవుతున్న అభ్యర్థి ప్రకటన
- కుల సమీకరణలపై స్పెషల్ ఫోకస్
- పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
సిద్దిపేట, వెలుగు: బీజేపీ సిద్దిపేట అభ్యర్థి ఎంపిక పై పార్టీ హైకమాండ్వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా..? బలమైన స్థానికేతర అభ్యర్థిని రంగంలోకి దించనుందా..? బీసీ కులాల్లోని ఏదైనా వర్గానికి టికెట్ కేటాయించనుందా..? అవసరమైతే మహిళా నేతను బరిలోకి దించనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా సిద్దిపేట అభ్యర్థి ప్రకటన పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియక స్థానిక బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇక బీఆర్ఎస్ సిద్దిపేట అభ్యర్థిగా మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా పూజల హరికృష్ణను ప్రకటించడంతో వారు ప్రచార రంగంలో బిజీగా మారారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియక పోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. సిద్దిపేట టికెట్ కోసం జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయిని నరోత్తం రెడ్డి, విద్యాసాగర్, భైరి శంకర్ ముదిరాజ్, ఉడుత మల్లేశం యాదవ్, టి. వెంకటేశం, పత్రి శ్రీనివాస్ యావ్, కొత్తపల్లి వేణుగోపాల్, బాలకృష్ణారెడ్డి, చక్రధర్ గౌడ్, తదితరులు అప్లై చేసుకున్నారు. వీరంతా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నా హైకమాండ్ మాత్రం వీరిపై ఆసక్తి లేనట్లుగా వ్యవహరిస్తోంది. సమీకరణలు మారితే తప్ప స్థానిక నేతలకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పార్టీ నేతలే చెబుతుండటం గమనార్హం.
బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట
సిద్దిపేట నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచి ఏడోసారి బరిలోకి దిగిన మంత్రి హరీశ్ రావును ఓడించాలంటే బలమైన అభ్యర్థిని పోటీలో దించాలనే దిశగా హైకమాండ్ఆలోచిస్తోందని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో పడిందని, అన్ని కోణాల్లో ఆలోచించి సిద్దిపేట అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే కోవర్టు రాజకీయాలకు పెట్టింది పేరైన సిద్దిపేటలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచూతూచీ వ్యవహరించడమే కాకుండా వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళుతున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు.
స్థానికేతరులకు అవకాశం..?
సిద్దిపేట అభ్యర్థిగా స్థానికేతరులకు అవకాశం లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ రియాల్టర్ తో పాటు పలువురి పేర్లు హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక సమయంలో స్థానిక హిందూ వాహిని నేతను పరిశీలించినా తాత్కాలికంగా దాన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే వేములవాడ టికెట్ ను ఆశిస్తున్న మహిళా నేతలు తుల ఉమ, హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి తో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిని బరిలోకి దించితే ఎలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి, మంత్రి హరీశ్‌రావుకు ఎంత మేర పోటీ ఇవ్వవచ్చనే విషయంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తీవ్ర ప్రయత్నాల్లో స్థానిక నేతలు
సిద్దిపేట టికెట్ కోసం అప్లై చేసుకున్న స్థానిక నేతలు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలను కలసి టికెట్ తమకే దక్కేలా చూడాలని, దశాబ్దాలుగా పార్టీ పటిష్టతకు కృషి చేసామనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దాదాపు డజను మంది సిద్దిపేట టికెట్ ఆశిస్తూ తమదైన రీతిలో హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సిద్దిపేట బీజేపీ అభ్యర్థిని సోమవారం లేదా ఈనెల 8వ తేదీన ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ : రాజకీయమంతా కులాల చుట్టే! .. గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు పార్టీల ప్లాన్
కుల సమీకరణల పై దృష్టి
సిద్దిపేట నియోజకవర్గంలో బీసీలే మెజార్టీ ఓటర్లు కావడంతో కుల సమీకరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో ముదిరాజ్ వర్గానికి టికెట్ కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినా గజ్వేల్ బరిలో ఈటల రాజేందర్ దిగడంతో పక్కనే ఉన్న సిద్దిపేటలో బీసీ వర్గంలోని ఇతర కులానికి టికెట్ కేటాయించాలనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గంగపుత్ర, కుమ్మరి, యాదవ , విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ తోపాటు ఇప్పటి వరకు టికెట్ కేటాయించని కులానికి ఇస్తే ఏ విధంగా ఉంటుందని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో బలమైన బీసీ కులానికి టికెట్ కేటాయించి ఒక ప్రయోగాన్ని చేయాలనే దిశగా చర్చలు సాగుతున్నాయి. బీసీలకు అత్యధికంగా టికెట్లు కేటాయించడంతో పాటు సామాజికంగా వెనుబడ్డ అన్ని కులాలకు టికెట్లు ఇచ్చి బీసీ నినాదం రేసులో ముందుండాలనే దిశగా ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు.