టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆశావహుల్లో ఉత్కంఠ

  • రేపు సీఎం సభలో  అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రచారం
  • మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వైపే హైకమాండ్‌‌‌‌‌‌‌‌ మొగ్గు

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. శనివారం మునుగోడులో జరిగే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సభలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డినే బైపోల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తారని సమాచారం. కూసుకుంట్ల పేరు ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.

కానీ ఇప్పటికే చాలా మంది సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, ఎంపీటీసీలతో పాటు చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి సీనియర్లు సైతం బీజేపీలో చేరారు. కష్టమైనా, నష్టమైనా సీఎం సభ రోజే కూసుకుంట్ల పేరు ప్రకటిస్తే ఓ పని అయిపోఉతందని హైకమాండ్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. అభ్యర్థిని ఏ టైంలో ప్రకటించినా పార్టీలో చేరికలు, వలసలు పోలింగ్ జరిగే వరకూ కొనసాగుతూనే ఉంటాయని పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఖరారు కావడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూసుకుంట్ల పేరు కూడా ప్రకటిస్తే నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్యే గట్టిపోటీ ఉంటుందనే సంకేతాలు పంపొచ్చన్న ఆలోచన చేస్తున్నారు.

దీనికోసమే అమిత్‌‌‌‌‌‌‌‌షా సభకు ముందు రోజే సీఎం సభను డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేశారని, భారీగా జనసమీకరణ చేసి ఆ వేదిక మీదే అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టొచ్చని అనుకుంటున్నారు. ఇప్పుడు  ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా సీఎం సభకే పరిమితం చేయడం వెనుక కారణం కూడా అదేనని చెపుతున్నారు. సీఎం సభ తర్వాత నియోజకవర్గంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులు వేరే జిల్లాల నుంచి వస్తారని, వాళ్లకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడొకరు చెప్పారు.

బీజేపీ నియమించిన ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులను ఢీ కొట్టాలంటే బలమైన నాయకులను మునుగోడుకు పంపాలని టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ పకడ్బందీగా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి సీనియర్లతో పాటు మరికొంత మంది మంత్రులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. 

పట్టువదలని ఆశావాహులు

బైపోల్‌‌‌‌‌‌‌‌ రేసులో ఉన్న ఆశావాహులు ఇంకా పట్టువీడడం లేదు. రేసులో ఉన్న ముఖమైన లీడర్లలో మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి సైలెంట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కానీ కంచర్ల ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అదే సామాజిక వర్గానికి చెందిన డీసీసీబీ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఏసిరెడ్డి దయాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెరపైకి వచ్చింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో దయాకర్ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసినట్లు తెలిసింది. మునుగోడు ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం.

మరోవైపు బీసీ కోటా నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విషయాన్ని హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఎటూ తేల్చలేదు. దీంతో కర్నె ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బూర నర్సయ్యగౌడ్ గురువారం చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీలరహితంగా జరిగిన ఈ కార్యక్రమానికి నర్సయ్య హాజరయ్యారు. కూసుకుంట్ల మీద వ్యతిరేకత వినిపిస్తుండడంతో చివరి నిమిషంలో అయినా తమకు కలిసొస్తదన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.