ఆగస్టు 15 తర్వాత డీఏపై ప్రకటన

ఆగస్టు 15 తర్వాత డీఏపై ప్రకటన
  •      సెప్టెంబర్ 5న కొత్త టీచర్లకు అపాయిమెంట్ ఆర్డర్లు
  •     టీచర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : పెండింగ్ డీఏలు, ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల సమస్యలపై ఆగస్టు 15 తర్వాత సర్కార్ కీలక ప్రకటన చేస్తదని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తదని చెప్పారు. ఈ నెలాఖరులోగా టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారన్నారు. టీచర్ల జేఏసీలు టీటీజేఏసీ, జాక్టో, యూఎస్​పీసీ నేతలు, ప్రొఫెసర్ కోదండరామ్​తో కలిసి శుక్రవారం సెక్రటేరియెట్​లో వేం నరేందర్ రెడ్డితో చర్చలు జరిపారు. డీఏలు, ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

 ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు. ‘‘సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీస్కుంటున్నం. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నయ్. భర్తీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు అపాయింట్​మెంట్ ఆర్డర్స్ అందేలా చూస్తాం. జేఏసీల నేతలంతా కలిసి సమస్యలపై చర్చించండి. మూడు నాలుగు కీలకమైన అంశాలపై వివరాలతో నివేదిక రెడీ చేసి ఉంచండి. 

రిపోర్టుపై అధికారులు, జేఏసీ ప్రతినిధులతో చర్చిస్తాం. ఈ నెలాఖరులోగా సీఎం రేవంత్​తో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తా’’అని అన్నారు. మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్కూళ్లలో ఉచిత విద్యుత్ ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. టీచర్ల సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టిందని, వాటిని ఎత్తేయాలని జేఏసీ నేతలు కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మూడు టీచర్ల జేఏసీ నేతలు బీరెల్లి కమలాకర్ రావు, కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, కృష్ణుడు, చావ రవి, జంగయ్య, పర్వత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.