యాదగిరిగుట్ట ఆలయంలో గోవర్ధనగిరిధారిగా నారసింహుడు

యాదగిరిగుట్ట ఆలయంలో గోవర్ధనగిరిధారిగా నారసింహుడు
  • సింహ వాహనంపై దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు
  • నేడుఎదుర్కోలు మహోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం ఉదయం 10 గంటలకు స్వామివారు గోవర్ధనగిరిధారిగా ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆలయంలో స్వామివారికి నిత్యారాధనలు ముగిసిన అనంతరం స్వామివారిని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అనంతరం రాత్రి 8.30 గంటలకు సింహ వాహనంపై ఊరేగించారు. తర్వాత తూర్పు ద్వారం ఎదుట స్వామివారిని అధిష్ఠింపజేసి నారాయణుడి అవతార విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఈవో భాస్కర్‌‌రావు, చైర్మన్‌‌ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రమేశ్‌‌బాబు, రఘు, నవీన్‌‌ పాల్గొన్నారు.

నేడు స్వామివారి ఎదుర్కోలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ముఖ్య ఘట్టాలు శుక్రవారం మొదలుకానున్నాయి. ఉదయం 10 గంటలకు స్వామివారిని జగన్మోహిని అలంకారంలో ముస్తాబు చేయనున్నారు. రాత్రి 7 గంటలకు ఆశ్వవాహనంపై ఊరేగించిన అనంతరం లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కొండపైన ప్రధానాలయం తూర్పు వైపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎదుర్కోలు మహోత్సవంలోనే స్వామిఅమ్మవార్ల తిరు కల్యాణానికి ముహూర్తం పెట్టనున్నారు.