వానాకాలం మొదలైనా.. జాడలేని పంట రుణ ప్రణాళిక

వానాకాలం మొదలైనా.. జాడలేని పంట రుణ ప్రణాళిక
  •     రుణమాఫీని సరిగ్గా అమలు చేయని గత పాలకులు
  •     కాంగ్రెస్​సర్కారుపై గంపెడాశలతో రైతులు
  •     ఇన్​ టైంలో లోన్లు ఇచ్చేలా చూడాలని  వినతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: వానాకాలం పంటల సీజన్ మొదలైనప్పటికీ భద్రాద్రి జిల్లాలో వార్షిక పంట రుణ ప్రణాళిక జాడలేదు. రైతులకు క్రాప్​లోన్లు అందని ద్రాక్షగానే ఉన్నాయి. గతేడాది లక్ష్యంలో కేవలం 51శాతం లోన్లు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలంతోపాటు రబీ సీజన్ల రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంతో సాగు పెట్టుబడికి రైతులు వడ్డీ వ్యాపారులు వైపు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీని సరిగా అమలు చేయకపోవడంతో.. ప్రస్తుత కాంగ్రెస్​ సర్కార్​పై రైతులు గంపెడాశలు పెట్టుకొన్నారు. వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసి ఇన్​ టైంలో లోన్లు ఇచ్చేలా బ్యాంకర్లను కలెక్టర్​ఆదేశించాలని కోరుతున్నారు. 

ఫైనల్​ కాని ప్రణాళిక..
 
జిల్లాలో దాదాపు1.80 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. వానాకాలం పంటల సీజన్​ మొదలు కావడంతో పొలాలను చదును చేసుకొని, దుక్కులు దున్ని విత్తనాలను వేసేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారు.  ఈ సీజన్​లో దాదాపు 4,87,312 ఎకరాల్లో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇవేకాకుండా 1.30 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉన్నాయి. ఎకరం వరికి రూ. 30 వేల నుంచి రూ. 35వేలు, పత్తికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి ఇవ్వాలి.  ఇప్పటివరకు పంట రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడం లేదు.

మరోవైపు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లతో జరిగిన పలు మీటింగుల్లో కలెక్టర్ ఆదేశిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 2023–24కు సంబంధించి రూ.2,710కోట్లకు గానూ క్రాప్​ లోన్లు ఇచ్చింది రూ . 1,400కోట్లే. 2022–23లో రూ. 2,477 కోట్లు క్రాప్​ లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ కేవలం రూ.1,354 కోట్లు మాత్రమే ఇచ్చారు.  అటు అగ్రి ఇన్​ఫ్రా స్కీమ్​ జిల్లాలో జాడలేకుండా పోయింది. ఇప్పటికైనా కలెక్టర్​స్పందించి వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసి వంద శాతం క్రాప్​ లోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

సీజన్​ మొదట్లోనే ఇస్తే బాగుంటుంది

వానాకాలం సీజన్ ​మొదలైనా ఇంకా పంట రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. ఇక కొత్త లోన్లు ఎప్పుడిస్తరు. అప్పు కోసం వ్యాపారులు వద్దకు వెళ్లక తప్పడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో వార్షిక పంట రుణ ప్రణాళికను ఆఫీసర్లు ఖరారు చేసి, జూన్​ నెల నుంచి క్రాప్​లోన్లు ఇస్తే బాగుంటుంది. 
- లాలు,  రైతు, టేకులపల్లి 

కొత్త లోన్లు ఇయ్యట్లె

రూ. లక్ష లోపు రుణ మాఫీ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏండ్లు గడించినా అది సరిగ్గా అమలు కాలేదు.  రుణ మాఫీ అవుతోందని తీసుకున్న లోన్​ రెన్యువల్​ చేసుకోలేదు. ప్రభుత్వం చేసే పనులతో అప్పుల కోసం వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
- బి. వెంకటేశ్వర్లు, రైతు,                               
టేకులపల్లి మండలం 

అప్పులు చేశాక లోన్లు ఇస్తే ఏం లాభం?

పంటల సీజన్​ మొదట్లోనే లోన్లు ఇస్తే రైతులకు లాభం. దుక్కులు దున్నడంతో పాటు విత్తనాలు, ఎరువులు అన్నింటికీ పైసలు కావాలి. రుణమాఫీ సక్రమంగా అమలు కాకపోవడంతో తీసుకున్న లోన్లకు సంబంధించి రెన్యువల్ ​కావడం లేదు. దీంతో కొత్త లోన్లు ఇవ్వమని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అధికారులు స్పందించి క్రాప్​ లోన్లను త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. 
- వెంకటేశ్వర్లు, రైతు, ఇల్లెందు