- ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువ
- మీటింగ్‌లో ప్రతిపాదించిన- 26 ఎజెండా అంశాల రద్దు
- లోటుతో ఎన్నాళ్లు నెట్టుకొస్తరు..? ఎమ్మెల్యే
- వాడీవేడిగా కామారెడ్డి మున్సిపల్ మీటింగ్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీలో ఏడాదికి రూ. 4 కోట్ల లోటు ఉంటోందని దీన్ని అధిగమించి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డిలో మున్సిపల్ మీటింగ్ గురువారం చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ పాల్గొన్నారు.
మీటింగ్ లో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఎవరినీ సంప్రదించకుండానే 26 ఎజెండా అంశాలు ప్రతిపాదించారని ఇందులో కొన్ని వార్డులకే ప్రయార్టీ ఇచ్చారని సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో శానిటేషన్, ఇతర డెవలప్ మెంట్స్ కు ప్రతిపాదించిన 26 ఎజెండా అంశాలను రద్దు చేశారు. తమ వార్డుల్లో అవసరాలు తీర్చేందుకు ఆఫీసర్లను కేటాయించాలని కౌన్సిలర్లు కలెక్టర్ ను కోరారు. ఓపెన్ స్థలాలను రక్షించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వాటార్సప్లయ్ కోసం ప్రతిపాదించిన అంశానికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. ఎజెండాలో పొందుపరిచిన పనులకు సంబంధించి ఇంజినీరింగ్ ఆఫీసర్లతో పరిశీలన చేయిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇలా ఎన్ని రోజులు నెట్టుకొస్తారు..
మున్సిపాలిటీకి ఏటా రూ. 11 కోట్ల ఆదాయం ఉంటే ఖర్చు రూ. 15 కోట్ల వరకు అవుతోందని ఏడాదికి రూ. 4 కోట్ల లోటు ఏర్పడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఆదాయం పెంచుకోకుండా లోటుతో ఇలా ఎన్ని రోజులు నెట్టుకొస్తారన్నారు. ఆస్తి పన్ను విధించని ఇండ్లను గుర్తించడం, కమర్షియల్ బిల్డింగ్‌లకు డొమెస్టిక్ ట్యాక్స్ విధించాలని, తక్కువ పన్నులు వేస్తున్న వాటిని గుర్తించి సరిదిద్దాలని సూచించారు. తద్వారా ఆదాయం పెంచుకోవాలి.
తప్పులు చేసే ఆఫీసర్లపై చర్యలు తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి. రోడ్ల వెడల్పు, ఇతర డెవలప్మెంట్ పనులకు కౌన్సిలర్లందరూ సహకరించాలన్నారు. త్వరలో మళ్లీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని నూతన ఎజెండా అంశాలను రూపొందించి ఆమోదిస్తామని చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ సుజాత, వైస్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్లు, ఆఫీసర్లు
పాల్గొన్నారు.
ప్రజలు సహకరిస్తేనే పట్టణ అభివృద్ధి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ రూ. 40 కోట్ల లోటుతో ఉందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కరెంట్ బిల్లులు రూ. 17 కోట్లు, కార్మికుల పీఎఫ్ బకాయిలు రూ.4.50 కోట్లు, పనులు చేసిన బిల్లుల చెల్లింపు రూ. 10 కోట్ల బకాయిలు ఇలా మొత్తం రూ. 40 కోట్ల మేర లోటు ఉందన్నారు. చాలా ఏరియాల్లో మున్సిపాలిటీలను చూశానన్నారు. వాటితో పోలిస్తే కామారెడ్డి మున్సిపాలిటీయే ఘోరంగా తయారయిందన్నారు. ప్రజలు సహకరిస్తేనే పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. పైసలు పెట్టి కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చిన ఆఫీసర్లు ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే చురకలంటించారు. పెట్టిన పైసలు ఇక్కడ వసూలు చేసి సంపాందించుకోవాలనుంటే కుదరదన్నారు. కామారెడ్డి ప్రజలు మార్పు కోరుకున్నారని దాన్ని అమలు చేసి చూపిస్తామన్నారు.