హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కోసం శనివారం జనం బారులు తీరారు. ఉదయం 9 గంటలకు బత్తిన కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మత్య్సశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు చేపప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చేప ప్రసాదం కోసం ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారని చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చేప మందు విశ్వాసంతో కూడుకున్నదని, దేశ విదేశాల నుంచి ఇక్కడికి చేపప్రసాదం కోసం వస్తున్నారని అన్నారు. 150 ఏండ్లకుపైగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమం కోసం తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కాగా.. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాయి. అలాగే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులతో పాటు ప్రత్యేకంగా 108 అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు.
నేడు ఉదయం 9 గంటల వరకు కార్యక్రమం
చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా జనం తరలివచ్చారు. ఎక్కువగా పదేండ్లలోపు చిన్నారులకు వారి తల్లిదండ్రులు చేప ప్రసాదం వేయించారు. మొత్తం 32 క్యూలైన్లు పెట్టి ప్రసాదం పంపిణీ చేశారు. మెయిన్ గేటు నుంచి ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. రూ.40 చెల్లించి టోకెన్ తీసుకొని ప్రసాదం పంపిణీ చేశారు. మొదటి రోజు సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 65 వేల మంది చేప ప్రసాదం తీసుకున్నారని అధికారులు తెలిపారు. బత్తిన సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులు దాదాపు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి జనం ఒకటి, రెండు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల తరువాత జనం కొంత తగ్గారు. సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిన కుంటుంబ సభ్యులు తెలిపారు.
గుండెపోటుతో నిజామాబాద్ వ్యక్తి మృతి
చేప ప్రసాదం కోసం నిజామాబాద్ నుంచి వచ్చిన గొల్ల రాజు (60) అనే వ్యక్తి క్యూలైన్లో నిల్చుని గుండెపోటుతో చనిపోయాడు. ఉదయం ఆయన లైన్ లో నిలబడి ఉండగా.. గుండెపోటుకు గురై కుప్పకూలాడు. బాధితుడిని వెంటనే నాంపల్లిలోని కేర్ హాస్పిటల్ కి తరలించగా అప్పటిగే ప్రాణాలు కోల్పోయాడు. చేప ప్రసాదం కోసం శుక్రవారం రాత్రి ఆయన ఇక్కడకు చేరుకున్నాడు.