రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు

రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు
  • రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగు మందుల వినియోగం
  • 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ 
  • వాటి ప్రభావంతో ఆస్తమా, అల్జీమర్స్​, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు
  • మసక బారుతున్న ​కండ్లు..మెదడుపైనా ప్రభావం 
  • ఎన్ఐఎన్, ఓయూ బయోకెమిస్ట్రీ డిపార్ట్​మెంట్ రీసెర్చ్​లో వెల్లడి

కరీంనగర్, వెలుగు: పంట చేన్లలో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వినియోగం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పురుగు మందుల వాడకంతో రైతులు ఆస్తమాలాంటి శ్వాసకోస వ్యాధులతోపాటు స్కిన్​ అలర్జీస్​ మొదలుకొని అల్జీమర్స్, క్యాన్సర్​ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నట్టు నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్​(ఎన్ఐఎన్), ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సైంటిస్టుల రీసెర్చ్​లో తేలింది.  ఈ అధ్యయాన్ని దిలేశ్వర్ కుమార్, సుకేశ్​ నారాయణ్ సిన్హా, కస్తూరి వాసుదేవ్, రాజేశ్​ కుమార్, గౌడ బాలాజీ, ముంగమూరి సతీశ్​ కుమార్, వలిదండి వాగ్దేవి నిర్వహించగా, విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో పదుల సంఖ్యలో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్టు తేలింది. 'బయోమానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్‌‌ పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, ఇండియా:ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్'  పేరిట రాసిన ఈ రీసెర్చ్ ఆర్టికల్ ను తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ‘ఎల్సెవియర్’ అనే మ్యాగజైన్​పబ్లిష్​ చేసింది. 

3 జిల్లాలు.. 493 మంది రైతులు.. 

సైంటిస్టులు తమ అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిళ్లను సేకరించి, పరీక్షించారు.వీరిలో పురుగు మందుల ప్రభావానికి లోనైన(వినియోగించే) సమూహానికి చెందిన 341 మంది రైతులు, పురుగు మందుల ప్రభావానికి లోనుకాని సమూహంలోని 152 మంది రైతులు ఉన్నారు. ఈ స్టడీ 2021- అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య కొనసాగింది. ఒక్కో జిల్లాలో 5 గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. గతంలో కనీసం ఒక ఏడాదిపాటు పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిళ్లను మాత్రమే తీసుకున్నారు. ఈ అధ్యయనంలో 18 ఏండ్ల నుంచి 70 ఏండ్ల వయస్సుగల రైతులు భాగస్వాములయ్యారు. 

 రక్తంలో 11 రకాల ప్రాణాంతక పెస్టిసైడ్స్ 

అధ్యయనంలో పాల్గొన్న రైతుల బ్లడ్ శాంపిళ్లలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ ఓ) మార్గదర్శకాల ప్రకారం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 11 రకాల పెస్టిసైడ్స్ తో సహా 28 రకాల వేర్వేరు పురుగు మందు అవశేషాలను గుర్తించారు. ప్రాణాంతకమైన అవశేషాల్లో కౌమఫాస్​, ఫెనామీఫాస్, డిక్లోర్వోస్, మెతామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయజోఫాస్ ఉన్నాయి. అలాగే, పురుగు మందులు వినియోగించని, వాటి ప్రభావానికి లోనుకాని రైతుల బ్లడ్ శాంపిళ్లతో పోలిస్తే.. పురుగు మందులు పిచికారీ చేసే రైతుల బ్లడ్ శాంపిళ్లలో పెస్టిసైడ్స్​అవశేషాలను ఎక్కువగా కనుగొన్నారు. పురుగు మందులను పిచికారీ చేసినప్పుడు ఎదురయ్యే సమస్యలపై రైతులను ప్రశ్నించగా..  కొందరు సరిగ్గా ఊపిరి ఆడడం లేదని, చాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటున్నాయని చెప్పగా.. మరికొందరు కంట్లో దురద, కోపం, కళ్లు మసకబారినట్లు కనిపించడం, తలనొప్పి, తల తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, తిమ్మిరి, కండరాల బలహీనతలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు.  

రాష్ట్రంలో మితిమీరిన పెస్టిసైడ్స్ వాడకం

రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలను చీడపీడలు ఎక్కువగా ఆశిస్తుండడంతో రైతులు పెస్టిసైడ్స్ ను అధికంగా వినియోగిస్తున్నారు. పంట దిగుబడిని, లాభాలను పెంచుకోవడానికి వాణిజ్య పంటలను సాగు చేస్తూ, వాటికి మితిమీరినస్థాయిలో పురుగుమందులను పిచికారీ చేస్తున్నారు. పెస్టిసైడ్స్​ను ఎక్కువ వాడడం వల్ల తలెత్తే నష్టాల గురించి, పిచికారీ సమయంలో సురక్షిత పద్ధతుల గురించి రైతులకు తగినంత అవగాహన లేకపోవడాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఎలాంటి గ్లౌజ్ లు వాడకుండా నేరుగా చేతులతో పురుగు మందులను కలపడం, సురక్షితం కాని పద్ధతిలో నిల్వ చేయడం, ఎక్కడపడితే అక్కడ పెస్టిసైడ్స్ ను పారవేస్తున్నట్టు ఈ స్టడీలో తేలింది. 

రైతులు అనారోగ్యానికి గురికాకుండా వారికి మెరుగైన భద్రత, నియంత్రణ చర్యల అవసరాన్ని ఈ అధ్యయనం సూచించింది. పురుగు మందుల పిచికారీ సమయంలో చర్మం,  ఊపిరితిత్తులు ప్రభావానికి లోనుకాకుండా ఉండేందుకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని ఈ స్టడీ తెలిపింది. అలాగే, పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు బయో పెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాలతోపాటు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్ మెంట్ పద్ధతులను పాటించాలని పరిశోధన బృందం సూచించింది.