మెదక్​ జిల్లాలో రూ.5,351 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

 మెదక్​ జిల్లాలో రూ.5,351 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
  • వ్యవసాయ రంగానికి రూ.3,166 కోట్లు

మెదక్, వెలుగు: 2024 -– 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్​ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఏడాదిలో మొత్తం బ్యాంకుల ద్వారా రూ.5,351 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.బుధవారం కలెక్టరేట్​లో కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అధ్యక్షతన బ్యాంకు లింకేజీ ఉన్న ప్రభుత్వ పథకాలపై బ్యాంకు కంట్రోలర్స్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన డీఎల్ఆర్సీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.

ప్రాధాన్యత రంగానికి రూ.4,550 కోట్లు , అప్రాధాన్యతా రంగానికి రూ.802 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యత రంగాల్లో వ్యవసాయానికి రూ.3,166 కోట్లు కేటాయించగా, వ్యాపార రంగానికి రూ.1,250 కోట్లు, విద్యా రుణాలకు, గృహ నిర్మాణానికి రూ.133 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. 

రైతులకు సకాలంలో రుణాలివ్వాలి 

ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వార్షిక రుణప్రణాళికలో ఎక్కువగా వ్యవసాయానికి కేటాయించామిన , సకాలంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలను అందించేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల నుండి బ్యాంకు రుణాల రికవరీ శాతం పెరిగితే అనుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయవచ్చని తెలిపారు. గతేడాది పంట రుణాల టార్గెట్​లో 76శాతం మాత్రమే ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఈ సారి వంద శాతం లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పథకాలలో బ్యాంకు లింకేజీ ఉన్న వాటిలో పెండింగ్​ లో ఉన్న వాటిని వెంటనే గ్రౌండ్ చేయాలని బ్యాంకర్స్ ని ఆదేశించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి వివిధ బ్యాంకుల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు వాటి కనుగుణంగా సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ సమావేశంలో డీఆర్​డీఓ శ్రీనివాసరావు, నాబార్డ్​ డీడీఎం కృష్ణ తేజ, ఆర్బీఐ లీడ్ జిల్లా మేనేజర్ పల్లవి, ఎస్బీఐ ఏజీఎం అరుణ్ జ్యోతి, యూబీఐ కంట్రోలర్​ వీర రాఘవ, ఏపీజీవీబీ కంట్రోలర్​ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.