- ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాలు చూయించని ఆఫీసర్లు
- ప్రమాదాల నివారణపై నామమాత్రంగానే సదస్సులు
- పాలమూరు జిల్లాలో 2,944 కల్లాలకు.. 529 మాత్రమే పూర్తి
మహబూబ్నగర్, వెలుగు :వడ్లు ఆరబెట్టేందుకు కల్లాలు ఏర్పాటు చేస్తున్నామని సర్కారు చెబుతున్న క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన వాటిలో 20 శాతం కూడా కంప్లీట్ కాలేదు. దీంతో రైతులు విధిలేక రోడ్లపైనే వడ్లు ఆరబోస్తున్నారు. కానీ, ఇలా చేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన మల్లేశ్(30) మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో జరుగుతున్న బంధువు నిశ్చితార్థానికి వెళ్లాడు. తిరిగి బైక్పై గ్రామానికి బయల్దేరిన ఆయన వేముల శివారు వద్ద వడ్ల కప్పుపైకి ఎక్కించాడు. అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై స్పాట్‌లోనే మృతి చెందాడు. ఇంకా అనేకమంది గాయాలపాలయ్యారు.
2,066 కల్లాలు స్టార్ కూడా కాలే..
కల్లాలను ఈజీఎస్ కింద మూడు రకాలుగా నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో 530 చదరపు అడుగుల కల్లం నిర్మాణానికి రూ.56 వేలు, 645 చదరపు అడుగుల కల్లానికి రూ.68 వేలు, 807 చదరపు అడుగుల కల్లానికి రూ.85 వేలు బిల్లులు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 2,944 వడ్ల కల్లాలు నిర్మించాల్సి ఉండగా రూ.2.31 కోట్ల నిధులు కేటాయించారు. కానీ, ఇప్పటి వరకు 529 కల్లాలను మాత్రమే పూర్తి చేశారు. 349 నిర్మాణ దశలోఉండగా, 2,066 కల్లాల పనులు స్టార్ట్ కూడా చేయలేదు. వంద శాతం పూర్తి చేసిన వాటిలో చాలా వరకు బిల్లులు ఇవ్వలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈజీఎస్ సాఫ్ట్ వేర్మారడంతో మార్చి వరకు కొన్నింటికి బిల్లులు క్లియర్ చేసి ఆ తర్వాత వాటిని పెండింగ్‌లో పెట్టారు.
హైవేలు, సర్వీస్ రోడ్లపైనే కుప్పలు
వరి కల్లాలు నిర్మాణం పూర్తి కాకపోవడంతో జిల్లాలోని మిడ్జిల్, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, అడ్డాకుల, మూసాపేట, కోయిల్కొండ, మహబూబ్నగర్ రూరల్మండలాల్లో రైతులు మెయిన్ రోడ్లపైనే వడ్లను ఆరబెడుతున్నారు. కొన్ని చోట్ల నెషనల్ హైవే సర్వీస్ రోడ్లపై రోజుల తరబడి వడ్లను ఆరబోస్తున్నారు. ఉదయం నుంచి ఎండబెట్టి సాయంత్రం వేళ కుప్పలు పోసి నల్లని టార్పాలిన్లు కప్పుతున్నారు. ఇవి రాత్రి పూట కనిపించకపోవడంతో బైకుల వెళ్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు.
అవగాహన సదస్సులు అంతంతే..
రోడ్ల మీద వడ్ల పోయడంతో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా లైట్ తీసుకుంటున్నారు. పోలీసులు కొన్ని మండల కేంద్రాల్లోని రైతులను పిలిచించి మాట్లాడుతున్నారే తప్ప.. గ్రామాల్లో పర్యటించడం లేదు. అగ్రికల్చర్ఆఫీసర్లు రైతు వేదికల్లో సదస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
ప్రత్యామ్నాయం చూయించట్లే..
వడ్లను ఆరబెట్టేందుకు ఆఫీసర్లు రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. గ్రామాల్లోనే ఉండే మైదాన ప్రాంతాలు, ఖాళీగా ఉండే ప్రదేశాల్లో వడ్లను ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. అటువైపు దృష్టిసారించడం లేదు. దీంతో రైతులు కొనుగోలు సెంటర్ల వద్దకు వడ్లను తీసుకొచ్చి ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా నిర్వాహకులు టార్పాలిన్లు అందించడం లేదు. చేసేది లేక వానాకాలం, యాసంగి సీజన్లలో సర్వీస్ రోడ్లు, గ్రామాలకు అనుసంధానంగా ఉండే మెయిన్ రోడ్లపైనే వడ్ల కుప్పలు పోస్తున్నారు.
స్థలాలు చూపిస్తలేరు
నాకున్న మూడు ఎకరాల్లో వరి వేసిన. ఇటీవల పంటను మొత్తం కోసిన. వడ్లను ఆరబెట్టుకుందామం టే ఎక్కడా స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వడ్లను ఆరబెట్టినం. నిన్న కురిసిన వర్షానికి వడ్లు కూడా తడిసిపోయినై. ఆఫీసర్లు వడ్లు ఆరబెట్టుకునేందుకు అనువైన స్థలం చూపించాలి.
- పుష్పమ్మ, చెన్నవెల్లి గ్రామం, రాజాపూర్ మండలం
కల్లాల మంజూరీ లేదంట
పంటను కోసినంక ఆరబెట్టేందుకు కల్లాలు లేక మస్తు ఇబ్బందవుతుంది. నిరుడు కల్లాల కోసం ఉపాధిహామీ ఆఫీసర్లను అడిగితే ఇప్పుడు మంజూరీ లేదని చెప్పిన్రు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీద వడ్లను ఆరబెడుతున్న. గవర్నమెంట్ సాయం చేస్తే కల్లాలు ఏర్పాటు చేసుకుంటం.
- శ్రీనివాసులు, రైతు, మిడ్జిల్