హైదరాబాద్, వెలుగు: స్టార్టప్ కంపెనీ ఆటమ్ ఛార్జ్ వివిధ రాష్ట్రాల్లో 10 ‘యూనివర్శల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల’ ను ఏర్పాటు చేసింది. మిర్యాల గూడ (తెలంగాణ), విజయవాడ(ఏపీ), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్), జజ్జర్ (హర్యానా), సంబల్‌పుర్ (ఒడిశా), తుమ్కుర్ (కర్నాటక), మిడ్నాపుర్ (వెస్ట్ బెంగాల్), పారామతి (తమిళనాడు), పుణే, నాగ్‌పూర్(మహారాష్ట్ర) సిటీలలో ఈ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కంపెనీ టైర్ 1,2 టౌన్లు, సిటీలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. దేశంలో సోలార్ పవర్‌తో నడిచే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన మొదటి కంపెనీ తమదేనని ఆటమ్ ఛార్జ్ పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించకుండా, తక్కువ ఖర్చులోనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నామని తెలిపింది. ఆటమ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను 200 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయొచ్చు. ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి సగటున రూ. 10 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ల వలన ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ అవుతుందని, ఈవీలకు అలవాటు పడడం పెరుగుతుందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
పర్యావరణానికి అనుకూలంగా ఆటమ్ ఛార్జ్..
ఈ పది ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను లాంచ్ చేయడంతో దేశంలో ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామనే విషయం తెలుస్తోందని ఆటమ్ ఛార్జ్ ఫౌండర్, విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ గడ్డం వంశీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీలు చాలా అవసరం అన్న ఆయన, హానికరమైన ఎమిషన్స్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ సాయపడతాయని చెప్పారు. అంతేకాకుండా ఈవీల వలన పెట్రోల్, డీజిల్‌పై దేశం చేస్తున్న ఖర్చు తగ్గుతుందని అన్నారు. దేశంలో 100 శాతం గ్రీన్ ఎనర్జీ (సోలార్ ఎనర్జీ) తో పనిచేస్తున్న మొదటి యూనివర్శల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తమలాగే ఆలోచించే కార్పొరేట్లు ఆటమ్ ఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై తమను కాంటాక్ట్ అవ్వాలని కోరారు.