- నేపాల్‌లోని త్రిశూలీ నదిలో బస్సులు పడ్డ ఘటనలో 12కు పెరిగిన మృతుల సంఖ్య
ఖాట్మండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 11 మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ సోమవారం వెలికితీశాయి. అందులో ముగ్గురు ఇండియన్లు, నలుగురు నేపాలీయులని అధికారులు తెలిపారు. వారి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. మిగతా నాలుగు డెడ్‌బాడీలు బస్సులో ఉన్నవారివా కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు.
ఈ డెడ్‌బాడీలన్నీ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో లభించాయన్నారు. గత శుక్రవారం బీర్గంజ్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ డీలక్స్ బస్సు, ఖాట్మండు నుంచి గౌర్‌కు వెళ్తున్న మరో బస్సుపై సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి.
ఆ టైంలో ముగ్గురు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగా మిగతా 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు భారత్ కు చెందిన ఒకరి మృతదేహం మాత్రమే అధికారులు ఆదివారం గుర్తించారు. సోనార్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ల సాయంతో 500మందికిపైగా నేపాలీ సైనికులు గల్లంతైనవాళ్లకోసం వెతుకుతున్నారు.