
- మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లిన వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్, వెలుగు : మామునూర్ ఎయిర్‌పోర్టును పునఃప్రారంభించేందుకు మరో 253 ఎకరాలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెప్పారు. బుధవారం హనుమకొండలోని క్యాంప్ ఆఫీస్‌లో ఆమె మంత్రిని కలిశారు. పీవీ పశు సంవర్ధక యూనివర్సిటీకి చెందిన 373.02 ఎకరాల భూములను ఖిలా వరంగల్ తహసీల్దార్‌కు అప్పగించాలని వివరించారు. దీని వల్ల ఏ320 తరహాలో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
ఆఫీసర్లు చేసిన గూగుల్ సర్వేలో నక్కలపల్లి, గాడిపల్లి, మామూనూర్ పరిధిలోని రైతుల వద్ద 249.33 ఎకరాల భూమి ఉందన్నారు. ఎయిర్‌పోర్టును ఆనుకొని ఉన్న యూనివర్సిటీ భూములు అందుబాటులోకి వస్తే రైతులకు పరిహారం కింద ఈ భూములు కేటాయించవచ్చని ఆమె మంత్రికి వివరించారు. విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
నాపై అలిగే హక్కు రాయపర్తి ప్రజలకుంది
రాయపర్తి, వెలుగు : ‘నేను ఎంత చేసినా రాయపర్తి ప్రజల రుణం తీర్చుకోలేను.. నాపై నమ్మకంతో 6 సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి ఎంపీగా గెలిపించారు.. నన్ను ఏదైనా అడిగే హక్కు, నాపై అలిగే హక్కు మీకే ఉంది’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. మండలంలోని ఊకల్, గట్టికల్, కొండాపురం, పానీశ్‌తండా, బాలాజీ తండాల్లో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పాలించిన పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఇతర పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహనాయక్, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు తదితరులు పాల్గొన్నారు.