- పట్నంలో మరో 297 బస్తీ దవాఖానలు కావాలి
- ప్రతిపాదనలు పంపిన హైదరాబాద్ జిల్లా వైద్య శాఖ
- ఇప్పటికే 163 ఏర్పాటు
- ప్రతి 10 వేల మందికి ఒక దవాఖాన ఉండాలనేది కేంద్రం రూల్
- వేధిస్తున్న సొంత బిల్డింగుల కొరత
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో త్వరలో మరో 297 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం జిల్లా వైద్య శాఖ ఫైనాన్స్కమిషన్కు ప్రతిపాదనలు పంపించింది. 2018లో పేదలుండే ప్రాంతాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఒక్కో చోట రోజూ యావరేజ్‌గా 100 వరకు ఓపీ నమోదవుతోంది. ఈ సెంటర్లలో ఓపీ సేవలతో పాటు గర్భిణులు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, షుగర్, బీపీ, ప్రైమరీ హెల్త్ టెస్టులతో పాటు 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అందించలేని వ్యాధులకు పీహెచ్‌సీలు, ఇతర సర్కారు దవాఖానలకు రెఫర్చేస్తారు.
వార్డుకు రెండు చొప్పున ఉండాలని..
హైదరాబాద్జిల్లాలో 84 వార్డులుండగా, ఒక్కో వార్డుకు రెండు చొప్పున 168 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా 81 వార్డుల్లో 163 బస్తీ దవాఖానలు తెరిచారు. బేగంబజార్, అడ్డగుట్ట, విజయ నగర్కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లు ఖాళీగా లేకపోవడం, మరికొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్‌లో ఏర్పాటుకు స్థానికులు ఒప్పుకోకపోవడం, సెట్విన్, ఇతర ట్రైనింగ్సెంటర్లు నడుస్తుండడంతో దవాఖానాలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
ఇలా గన్‌ఫౌండ్రీలో ఐదు, మరికొన్ని చోట్ల రెండు కంటే ఎక్కువ దవాఖానలు ఏర్పాటు చేశారు. 18 వార్డుల్లో కమ్యూనిటీ హాళ్లు లేక ఒక్కొక్క దవాఖానతోనే సరిపెట్టారు. ప్రస్తుతం కంటోన్మెంట్ఏరియాలో పది బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆరు సెంటర్లు రన్అవుతున్నాయి. మరొకటి ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉంది. మరో మూడు సెంటర్లకు కమ్యూనిటీ హాళ్లు దొరక్క పెండింగ్ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.
ప్రతి 10 వేల మందికి ఒక దవాఖాన
కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి పదివేల మందికి ఒక దవాఖాన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం హైదరాబాద్జిల్లా జనాభా 46 లక్షలు ఉండడంతో 460 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే నగరంలో ఇప్పటికే 163 సెంటర్లు ఉండగా, మరో 297 సెంటర్లు ఏర్పాటు చేయాలి. దీంతో 297 బస్తీ దవాఖానల కోసం జిల్లా వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు కమ్యూనిటీ హాళ్ల కొరతతో చాలా చోట్ల దవాఖానలు ఏర్పాటు చేయలేదని, ఆ హాల్స్లభించకపోతే భవనాలను అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక్కొక్క బస్తీ దవాఖాన ఉన్న వార్డులు
హైదరాబాద్జిల్లాలో పత్తర్‌గట్టి, మొఘల్‌పురా, నవాబ్‌సాహెబ్‌కుంట, ఘన్సీ బజార్, కిషన్‌బాగ్, జియాగూడ, మంగళ్ హాట్, లంగర్‌హౌస్, నానల్‌నగర్, గుడి మల్కాపూర్, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, అంబర్ పేట్, బాగ్అంబర్పేట్, అడిక్‌మెట్, అమీర్‌పేట్, బౌద్దనగర్, రాంగోపాల్ పేట్ఇలా18 వార్డుల్లో ప్రస్తుతం ఒక్కో బస్తీ దవాఖాన మాత్రమే ఉంది.