![మరో 487 మందిని పంపిస్తం.. డిపోర్టేషన్ ఏర్పాట్లు చేస్తున్న అమెరికా అధికారులు](https://static.v6velugu.com/uploads/2025/02/another-487-will-be-sent-american-officials-making-deportation-arrangements_YvK08C3tFr.jpg)
- ఈమేరకు సమాచారం అందినట్లు భారతవిదేశాంగ శాఖ వెల్లడి
- ఇప్పటికే 104 మంది ఇండియన్స్నుపంపేసిన అమెరికా
- మూడేండ్లలో 4,200 మంది అక్రమంగా అమెరికాలోకి!
న్యూఢిల్లీ: అక్రమంగా తమ దేశంలో ఉంటున్న మరో 487 మంది ఇండియన్స్‌ను వెనక్కి పంపిస్తున్నట్టు అమెరికా సమాచారం ఇచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అమెరికా ఇప్పటికే 104 మంది ఇండియన్స్ ను సీ17 సైనిక విమానంలో అమృత్సర్ తీసుకొచ్చి వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 487 మందిని వెనక్కి పంపిస్తున్నట్టు వెల్లడించడం గమనార్హం.
శుక్రవారమిక్కడ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ ‘‘అమెరికా వారి న్యాయ వ్యవస్థ, చట్టాల ప్రకారం అక్రమ వలసదారులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నది. అక్కడున్న ఇల్లీగల్ ఇండియన్స్ సంఖ్యపై మాకు కొంత సమాచారం అందింది. మాకు వెల్లడించిన సమాచారం మేరకు మేం వారితో కోఆర్డినేట్ చేస్తున్నం” అని అన్నారు. ఇండియన్స్‌ను వెనక్కి పంపించేందుకు అమెరికా సైనిక విమానాలను ఉపయోగించడంపై మాట్లాడుతూ.. ‘‘అమెరికా చేపట్టిన ఈ ప్రత్యేక బహిష్కరణ కార్యక్రమం గతంలో కంటే భిన్నమైన విమానాలతో అమలు చేస్తున్నారు. ఆ దేశ వ్యవస్థలోనే అందుకు అనుగుణంగా రూల్స్ ఉన్నాయి. వారు దీనిని జాతీయ భద్రతా చర్యగా చూస్తున్నారు” అని అన్నారు.
సంకెళ్లతో పంపడంపై ప్రతిపక్షాల మండిపాటు
ఇండియన్లను వెనక్కి పంపించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. గొలుసులు, సంకెళ్లతో భారతీయులను సైనిక విమానంలో పంపించడాన్ని ఎలా ఒప్పుకుంటారని, ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ విషయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ.. యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ద్వారా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
మూడేండ్లలో 4200 మంది అక్రమంగా..
గత మూడేండ్లలో ఇండియా నుంచి 4200 మంది అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అనుమానిస్తోంది. పంజాబ్, గుజరాత్ నుంచి ఎబిక్స్ క్యాష్ అనే ఫైనాన్సియల్ సర్వీస్ ద్వారా జరిగిన 8,500 లావాదేవీలను పరిశీలిస్తోంది. అక్రమ మార్గాల్లో అమెరికాలోకి పంపించే ఏజెంట్లు ఒక్కో వ్యక్తికి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఆపై వసూలు చేస్తారని, దీనికి సంబంధించిన లావాదేవీలు ఎబిక్స్ క్యాష్ లో జరుగుతాయని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఎబిక్స్ క్యాష్ లో భారతీయులు జరిపిన లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.