- కార్మిక క్షేత్రానికే 80 శాతం మహిళాశక్తి చీరల ఆర్డర్లు
- యూనిఫాం చీర నమూనాకు సీఎం రేవంత్ ఆమోద ముద్ర
- మొదటి విడతలో 64 లక్షల చీరల ఉత్పత్తికి చాన్స్
- సిరిసిల్లలో మోగనున్న సాంచాల చప్పుడు
రాజన్నసిరిసిల్ల,వెలుగు : సిరిసిల్లలో సాంచాల సప్పుడు మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి యూనిఫాం చీరలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్కో ఆధ్వర్యంలో రెండు, మూడు రకాల నమూనా చీరలు రెడీ చేయగా ఇటీవలే ఒక చీరను సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. మొదటి విడత 4.25కోట్ల మీటర్ల వస్త్రంతో 64లక్షల చీరలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, సిరిసిల్ల కార్మిక క్షేత్రానికే అత్యధికంగా 80శాతం చీరల ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. దీనిపై కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సిరిసిల్లలోనే అత్యధిక మగ్గాలు
సిరిసిల్లలోనే అత్యధికంగా 20,460 మరమగ్గాలు ఉన్నాయి. 5వేల మంది కార్మికులు మరమగ్గాలపై పని చేస్తున్నారు. అనుబంధ రంగాల కార్మికులు మరో 3వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. 1,606 ఆసాములు వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. అందువల్ల అత్యధికంగా మరమగ్గాలు ఉన్న సిరిసిల్లకే 80 శాతం ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే నిర్ణయించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.
కాగా, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేయించి, సిరిసిల్ల నేతన్నలకు రూ. 370కోట్ల దాకా బకాయిలు పెట్టింది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, బకాయిల నుంచి విముక్తి కల్పిస్తున్నది. అదే సమయంలో ఇటీవల వేములవాడ పర్యటన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతుకమ్మ చీరల కంటే నాణ్యమైన చీరల ఉత్పత్తికి ఆర్డర్ లు ఇస్తామని హామీ చెప్పారు. అన్నట్లుగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
చీర నమూనా రెడీ..
రాష్ట్ర ప్రభుత్వం సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందించబోయే యూనిఫాం చీరల నమూనా ఇప్పటికే రెడీ అయింది. నీలిరంగు చీర, మూడు రంగుల జాతీయ జెండా కలర్స్ తో కూడిన ఫ్లవర్స్ అంచునతో దీనిని రూపొందించారు. చీర అంచున బ్లూ ప్రింట్ బార్డర్ నేశారు. కింద మువ్వల పట్టీల డిజైన్ ఆకర్షిస్తోంది. 8 సెంటీమీటర్ల బ్లౌజ్, 6.30 మీటర్ల పొడవు చీర ఉండనుంది.
50 సంవత్సరాలపై బడిన మహిళలకు 9 గజాల చీరలను 5 లక్షల మీటర్ల ప్లేన్ చీరలను రెడీ చేయనున్నారు. గత సర్కార్ నాసిరకం పాలిస్టర్ క్లాత్ తో బతుకమ్మ చీరలను అందించిందన్న విమర్శలు వచ్చాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా క్వాలిటీ క్లాత్‌తో చీరలను ఉత్పత్తి చేయించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది.
త్వరలో చీరలకు ఆర్డర్లు
స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరల డిజైన్ ఖరారైంది. త్వరలోనే చీరల తయారీకి ఆర్డర్లు ఇస్తాం. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎక్కవగా చేనేత మగ్గాలు సిరిసిల్లలో ఉన్నందున అధిక శాతం ఆర్డర్లు ఇస్తారు. వారం, పది రోజుల్లో చీరల ఆర్డర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది.
– అశోక్ రావు, టెస్కో జనరల్ మేనేజర్, హైదరాబాద్ -