హైదరాబాద్ ఫార్ములా ఈ- కార్ రేసింగ్‎లో మరో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్ ఫార్ములా ఈ- కార్ రేసింగ్‎లో మరో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్ రేసింగ్‎ నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులు మంగళవారం (అక్టోబర్ 29) ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‎లో రూ.55 కోట్లు దారి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ అధికారుల ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం.. ఆ తర్వాత ఏసీబీ ఎంట్రీ అయితే జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‎ను మరింత పెంచేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‎లో గత ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించింది. అయితే, ఫార్ములా ఈ కార్ రేసింగ్‎ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించింది. దాదాపు రూ.55 కోట్లు దారిమళ్లించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. బోర్డు, ఆర్థిక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లించిందన్నది ప్రధాన అభియోగం. 

ALSO READ | సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు

పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు చేయడం, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా విదేశీ సంస్థకు నిధుల బదిలీ జరిగినట్లు సైతం ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు హెచ్ఎండీఏ నుండి నిధులు బదిలీ చేశామని అధికారులు ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. దీంతో అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ వేగవంతంగా జరుగుతోన్న వేళ.. అనూహ్యంగా ఫార్మూలా ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.