మరో బీజేపీ నేత దారుణ హత్య.. మావోయిస్టుల పనేనా ?

మరో బీజేపీ నేత దారుణ హత్య.. మావోయిస్టుల పనేనా ?

మరో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పెళ్లి కార్యాక్రమానికి వెళ్లి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌  జిల్లాలో చోటుచేసుకుంది. జన్‌పడ్‌ కు చెందిన బీజేపీ నేత కట్ల తిరుపతి మార్చి 1వ తేదీ శుక్రవారం రాత్రి టోయనార్‌ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యాక్రమం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో దుండగులు పదునైన కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారని జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ)  జితేంద్ర యాదవ్‌ చెప్పారు. మావోయిస్టులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గత ఏడాది నవంబర్ లో నారాయణ్‌పూర్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్‌దూబేను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే.   తాజాగా మరో బీజేపీ నేతహత్యకు గురి కావడంతో స్థానిక బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది.