వారంలో రెండో ఘటన..సూసైడ్​స్పాట్​గా కేబుల్ బ్రిడ్జి..దుర్గం చెరువులో మరో మృతదేహం

వారంలో రెండో ఘటన..సూసైడ్​స్పాట్​గా కేబుల్ బ్రిడ్జి..దుర్గం చెరువులో మరో మృతదేహం
  • ఇటీవల మహిళ మృతదేహం లభ్యం
  • వారం గడవకముందే మరో డెడ్​బాడీ గుర్తింపు
  • సూసైడ్​ స్పాట్​గా కేబుల్ బ్రిడ్జి!
  • పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసినా ఫలితం సున్న

మాదాపూర్, వెలుగు: వారం గడవకముందే దుర్గం చెరువులో మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో చెరువు బోట్ హోల్టింగ్ పాయింట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహం తెలియాడుతూ కనిపించింది.

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి డెడ్​బాడీని చెరువు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 3న సైతం దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం లభించింది. ఎల్లారెడ్డి గూడకు చెందిన దుర్గా మాధవి (55) మానసిక సమస్యలతో అంతకుముందు రోజు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి సూసైడ్​చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకొని చెరువులోకి దూకి చనిపోతున్నారు. వీటిని నివారించడానికి పోలీసులు కేబుల్ బ్రిడ్జి కింద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. కేబుల్ బ్రిడ్జిపై నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నా  క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.