వీధి కుక్కల దాడికి.. 12 ఏళ్ల బాలుడు బలి

హైదరాబాద్ లో ఇటీవల కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి విషాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యూపీలోని బరేలీలోని ఖానా గౌన్తియా గ్రామంలో 12 ఏళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడికి యత్నించాయి. వెంటనే అప్రమత్తమై పరుగులు తీశాడు. ఈ క్రమంలో కింద పడిన బాలుడిపై కుక్కలు విచ్చలవిడిగా దాడికి తెగబడ్డాయి. గమనించిన స్థానికులు  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.  ఈ ఘటనలో మరో బాలుడు గాయపడ్డాడు.

ఇదే మొదటిది కాదు..

బరేలీలో పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందింది. శునకాలు ఆమెను 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి చంపేశాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, కొన్నాళ్ల కు మర్చిపోతుండటం గమనార్హం.